- సిపిఎం పొలిట్ బ్యూరో విమర్శ
- అసమానతలు పెంచే బడ్జెట్
- మధ్య తరగతి వర్గాల పేరుతో ప్రచారమే
- ఆందోళనలకు పిలుపు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్‌లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ ప్రజల అవసరాలకు దారుణంగా ద్రోహం చేసిందని సిపిఎం విమర్శించింది. ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలు ఎదుర్కొంటున్న డిమాండ్ సమస్యను పరిష్కరించడానికి, మూకుమ్మడి నిరుద్యోగం, వేతనాల కుంగుబాటు వంటి కారణాల వల్ల మెజారిటీ వర్గాల చేతుల్లో కొనుగోలు శక్తి కొరవడిన సమస్యలకు మూల కారణాన్ని పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వ వ్యయాన్ని కుదించింది. అధిక ఆదాయాలు కలిగిన అతి తక్కువ మందికి పన్నుల్లో కోతలను ప్రకటించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితపరచడానికి మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రయత్నించింది. భారతదేశంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న నిస్సహాయ పరిస్థితులను ఆర్థిక సర్వే ఎత్తి చూపించింది. గత ఐదేళ్ళుగా ఆదాయాల్లో తగ్గుదలను ప్రముఖంగా పేర్కొనగా ఈ బడ్జెట్ మాత్రం ప్రభుత్వ వ్యయాల్లో కోతలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. మరోవైపు సంపన్నులకు రాయితీలు ఇవ్వడంపై కూడా దృష్టి సారించింది. దీనివల్ల భారతదేశంలో ఇప్పటికే వున్న అసమానతలు ఇంకా పెరుగుతాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది. సంపన్నులపై, బడా కార్పొరేట్ సంస్థలపై పన్నులు వేయడం, ఉపాధిని ఉత్పత్తి చేయడానికి దోహదపడేలా ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం ద్వారా వనరులను సమీకరించడానికి, అలాగే మన ప్రజలకు కనీస వేతనాలకు హామీ కల్పించడానికి బదులు అందుకు భిన్నమైన చర్యలు చేపట్టడానికే మొగ్గుచూపింది. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా సంపన్నుల వల్ల మరింత పెద్ద మొత్తంలో సంపద పోగుపడాలని కోరుకుంటోంది. ఇందుకోసం ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ వ్యయాలను కూడా వారి సేవలో వుంచుతోంది. బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డిఐని ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని కూడా భావిస్తోంది. అందువల్ల ఇది సంపన్నుల కోసం సంపన్నులు రూపొందించిన బడ్జెట్.
జిడిపిలో వ్యయాన్ని శాతంగా చూసినట్లైతే మరోసారి కోతపడింది. 2020-21 నుండి ప్రతి ఏటా ఇలా జరుగుతునే వుంది. 2024-25లో వ్యయం 14.6శాతం వుండగా, 2025-26లో ఇది 14.2శాతానికి తగ్గింది. పైగా ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతున్న దానికి పూర్తి భిన్నంగా జరుగుతోందని బడ్జెట్ పత్రాలను బట్టి చూస్తే తెలుస్తోంది. వాస్తవానికి బడ్జెట్‌లో ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిన దాని కన్నా దాదాపు లక్ష కోట్ల రూపాయిలు తక్కువగా గతేడాది ఖర్చు పెట్టారు. మరో మాటలో చెప్పాలంటే, గత రికార్డును పరిశీలిస్తే, హామీలిచ్చిన మేరకు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టనందున ఆ అరకొర కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో అమలయ్యాయని చెప్పలేం. బడ్జెట్‌లో పేర్కొన్న గణాంకాలతో పోలిస్తే, గతేడాది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,12,000కోట్ల మేరకు బదలాయింపు మొత్తాలను తగ్గించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చే నిధులను రూ.90వేల కోట్లు మేరకు తగ్గించగా, ఆర్థిక సంఘం, ఇతర బదలాయింపుల ద్వారా రావాల్సిన మొత్తాలను రూ.22వేల కోట్లు తగ్గించారు. ఆ రకంగా, సమాఖ్యవాదం సూత్రాలను నీరుగార్చడాన్ని, రాష్ట్రాల హక్కులపై దాడులు జరపడాన్ని బడ్జెట్ ప్రతిబింబించింది.
2024-25లో కోతలు పెట్టుబడుల వ్యయాలను కూడా దెబ్బ తీశాయి. బడ్జెట్‌లో పేర్కొన్న గణాంకాల కన్నా ఇవి దాదాపు 93వేల కోట్లు తక్కువగా వుండనున్నాయి. ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, విద్య, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పట్టణాభివృద్ధి ఇలా అన్ని రంగాలు ఈ కోతలను ఎదుర్కొన్నాయి. 2025-26 సంవత్సరానికి కూడా దాదాపు 2024-25 బడ్జెట్ గణాంకాలే వున్నాయి. వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లైతే ఈ కేటాయింపులు స్తంభించాయి. జిడిపిలో శాతంగా చూస్తే గతేడాది కన్నా తగ్గాయి. గతేడాది బడ్జెట్‌లో ఆహార రంగానికి కేటాయింపులు రూ.2.05 లక్షల కోట్లుగా వున్నాయి. కానీ గతేడాది సవరించిన అంచనాల్లో వ్యయం రూ.7,830కోట్లు తగ్గింది. ఈసారి బడ్జెట్‌లో ప్రతిపాదిత మొత్తం రూ.2.03 లక్షల కోట్లుగా వుంది. అంటే ఇది గతేడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాల కన్నా తక్కువగానే వుంది. అలాగే, విద్యా రంగానికి కూడా గతేడాది బడ్జెట్‌లో కేటాయింపులు 1.26లక్షల కోట్లు కాగా సవరించిన అంచనాలు చూస్తే వారు 11,584కోట్లు తక్కువగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యా రంగ కేటాయింపులు గతేడాది బడ్జెట్ అంచనాల కన్నా కేవలం 14,596 కోట్లు మాత్రమే ఎక్కువ. సాధారణంగా చూసినట్లైతే ఈ కేటాయింపులు కేవలం 2.3శాతమే పెరిగాయి. అదే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లైతే వాస్తవంగా ఎలాంటి పెరుగుదల లేదు. ఇక ఆరోగ్య రంగ కేటాయింపులకు సంబంధించి సవరించిన అంచనాలు గతేడాది బడ్జెట్ అంచనాల కన్నా తక్కువగానే వున్నాయి. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల రంగంలో బడ్జెట్ అంచనా 1.5లక్షల కోట్లుగా వుండగా, ప్రభుత్వం వ్యయం సవరించిన అంచనాల ప్రకారం 10,992కోట్లు తక్కువగా వుంది. గతేడాది సవరించిన అంచనాల ప్రకారం ఎల్‌పిజి సబ్సిడీని 14.7 వేల కోట్ల నుండి ఈ ఏడాది బడ్జెట్‌లో 12వేల కోట్లకు తగ్గించారు.
గ్రామీణ పేదలకు జీవనాడిగా వున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు అరకొరగా వున్నాయంటేనే ఈ ప్రభుత్వ నయవంచన అర్ధమవుతోంది. డిమాండ్ పెరిగినప్పటికీ కేటాయింపులు మాత్రం 86వేల కోట్ల రూపాయల దగ్గరే స్తబ్ధుగా వున్నాయి. ఇది గ్రామీణ పేదలపై క్రూరంగా దాడి చేయడమే కాదు, వంద రోజులు పని కల్పించాలన్న చట్టబద్ధమైన హక్కుపై అత్యంత దారుణంగా దాడి చేయడమే. వ్యవసాయరంగ దుస్థితిని పరిష్కరించడానికి, రైతుల ఆత్మహత్యలను నివారించడానికి కీలకమైన అంశమైన రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.
ఎస్‌సి, ఎస్‌టిలు, మహిళలపై పెట్టే వ్యయాలకు బడ్జెట్‌లో ప్రత్యేక పద్దులు వున్నాయి. ముఖ విలువ (ఫేస్ వాల్యూ) వద్దే పరిశీలించినా కూడా ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యం ఎంతలా వుందో బడ్జెట్ పత్రాలు చూపిస్తున్నాయి. 2024-25లో ఎస్‌సిలకు కేటాయింపుల్లో రూ.27వేల కోట్లు కోత పడ్డాయి. ఎస్‌టిలకు కూడా ఇదే రీతిలో రూ.17వేల కోట్లు కోత పడింది. జనాభాలో ఆయా సామాజిక గ్రూపుల శాతం ఎలా వుందో ఆ దామాషా మేరకే వ్యయం కూడా వుండాలని మార్గదర్శకాలు నిర్దేశిస్తుండగా, మొత్తం వ్యయాల్లో ఇటువంటి వ్యయాల వాటాలు గణనీయమైన రీతిలో తగ్గుతున్నాయి. 2025-26 సంవత్సరానికి, ఎస్‌సి, ఎస్‌టిలకు వరుసగా మొత్తం వ్యయాల్లో కేవలం 3.4శాతం, 2.6శాతం మాత్రమే కేటాయింపులు వున్నాయి. ఈశాన్య ప్రాంతాలకు కేటాయింపులు కూడా బడ్జెట్ గణాంకాలతో పోలిస్తే రూ.13వేల కోట్లు తగ్గాయి. బాలల సంక్షేమంపై కూడా కేటాయింపుల్లో కోత పడింది. 2023-24 బడ్జెట్‌తో పోలిస్తే 2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్, కన్నా చిన్నదిగా వుంది. ఈ పద్దుల కింద కేటాయింపులు 2025-26లో కూడా తక్కువగానే కొనసాగుతున్నాయి.
పన్ను మినహాయింపు పరిమితిని 12లక్షల రూపాయలకు పెంచడం ద్వారా ”మధ్య తరగతి ప్రజలకు సాయం చేస్తున్నాం” అన్న ప్రచారం చాలా జరుగుతోంది. వ్యక్తిగత ఆదాయపన్నులో తీసుకువచ్చిన ఈ మార్పుల వల్ల మధ్య తరగతి ప్రజలు పొందే ప్రయోజనం దేశ జనాభాలో ఒక శాతం కన్నా తక్కువమంది వుండే సంపన్న వర్గం పొందే ప్రయోజనాల కన్నా చాలా తక్కువగా వుండనుంది. ఆదాయపన్ను రాయితీల కారణంగా ప్రభుత్వానికి వచ్చే నష్టం రూ.లక్ష కోట్లలో ప్రధాన వాటా పొందేది కూడా వారే కానున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, అధిక ఆదాయ పన్ను స్లాబ్ రేట్లను పెంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని దిగువ మధ్య తరగతి వర్గాల పన్ను భారం తగ్గింపుతో కలిపివుంటే బాగుండేది
మోడీ ప్రభుత్వ దివాళాకోరుతనాన్ని 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. సంపన్నులు, కార్పొరేట్ రంగ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని రుజువైంది. ఆర్థిక వ్యవస్థలో మాంద్యాన్ని పరిష్కరించేందుకు కనీసం ఎలాంటి వాస్తవిక విధానాన్ని రూపొందించలేకపోయింది. భారతదేశంలో వేతనాలు కరోనా ముందు కాలం కన్నా తక్కువగా వున్న పరిస్థితి నెలకొందని, డిమాండ్ ఇబ్బందుల కారణంగా అభివృద్ధి కూడా మందగిస్తోందని ఆర్థిక సర్వే పేర్కొనగా ఈ సంక్షోభం తీవ్రత లేదా దాని స్వభావం ఈ ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రికి కనిపించనట్లు వుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు తమ సారధ్యం గొప్పగా వుందని వారు చెప్పుకోవడం దగ్గరే ఆగిపోయారు. ఖర్చులు తగ్గించడం, సంపన్నులపై పన్నులు తగ్గించడం, ప్రైవేటు కార్పొరేట్, విదేశీ పెట్టుబడిదారుల జంతు స్ఫూర్తిని వెలికితీసే చర్యలేవీ కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు, పెట్టుబడులను సృష్టించలేదు, ఉపాధి వృద్ధిని తీసుకురాలేదు అనడానికి పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ అనేది ఘోరంగా విఫలమైన విధానానికి తాజా కొనసాగింపు మాత్రమే. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడానికి ప్రజలను సమీకరించాల్సిందిగా అన్ని పార్టీ శాఖలకు పొలిట్‌బ్యూరో పిలుపునిస్తోంది.