- కేంద్ర కమిటీ ప్రకటన
- సీతారాం ఏచూరి, బుద్ధదేవ్, ఆర్‌ఎస్‌తో సహా అమరవీరులకు సంతాపం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం సమన్వయకర్తగా ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్‌ను కేంద్ర కమిటీ నియమించింది. ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మదురైలో జరిగే పార్టీ 24వ అఖిలభారత మహాసభ వరకు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలను సమన్వయపరిచే బాధ్యత ఆయన నిర్వహిస్తారు. ప్రస్తుత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆకస్మికంగా కనుమూసినందున ఈ ఏర్పాటు అవసరమైంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, కేంద్ర కమిటీ మాజీ సభ్యులు ఎంఎం లారెన్స్, సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఆర్ సత్యనారాయణరాజు (ఆర్‌ఎస్) తదితరుల మృతికి సంతాపం తెలుపుతూ కేంద్ర కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై కేంద్ర కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, బివి రాఘవులు, సూర్యకాంత్ మిశ్రా, సుభాషిణి అలీ, ఎమ్‌డి సలీం, ఎంఎ బేబి, తపన్ సేన్, జి రామకృష్ణ, ఎ విజయరాఘవన్, నిలోత్పల్ బసు, అశోక్ ధావలే, రామచంద్రడోమ్, గోవిందన్ మాస్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ అరుణ్‌కుమార్, హేమలత, పుణ్యవతి, జి నాగయ్య, సిహెచ్ సీతారాములు, బి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.