పాట్నా : ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండేళ్ల క్రింత ప్రారంభించిన ‘జన్ సురాజ్ పార్టీ’కి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యాక్రమంలో ప్రశాంత్ కిశోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో తన రాజకీయ పార్టీని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ‘ఈ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలంగా ఉంది. ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది’ అని ఆయన అన్నారు. అయితే తమ పార్టీకి నాయకత్వం మాత్రం తన చేతుల్లో లేదని, రెండేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వారే నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మూడు దశాబ్దాలుగా బీహార్ ప్రజలు ఆర్‌జెడి లేదా జెడియు లేదా బిజెపికి మాత్రమే ఓటు వేస్తున్నారని, ఇప్పుడు ఆ సంప్రదాయానికి తెరపడాలని ఆయన కోరారు. అయితే బిజెపికి నమ్మినబంటుగా ఆ పార్టీ కనుసన్నల్లోనే ఆయన పని చేస్తున్నారని, బీహార్‌లో నితీష్ పాలన అప్రతిష్టపాలైన నేపథ్యంలో కొత్త ఎత్తుగడగానే ప్రశాంత్ కిశోర్‌ను బిజెపికి తెరపైకి తీసుకొస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
