సిక్కిం సిఎంగా ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ ప్రమాణస్వీకారం

Jun 10,2024 23:55 #cm, #sikkam

గ్యాంగ్‌టక్‌ : సిక్కిం ముఖ్యమంత్రిగా వరసగా రెండోసారి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కెఎం) అధినేత ప్రేమ్‌ సింగ్‌ చేత ముఖ్యమంత్రిగా గవర్నర్‌ లక్ష్మణ్‌ప్రసాద ఆచార్య ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం పాల్‌జోర్‌ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ఎస్‌కెఎం కార్యకర్తలు, మద్దతుదారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. సిక్కింలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నా ఎస్‌కెఎం కార్యకర్తలు కాల్చారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌కెఎం మొత్తం 32 స్థానాల్లో 31 స్థానాలను గెలుచుకుని వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో సోనమ్‌ లామా, అరుణ్‌ కుమార్‌ ఉప్రెటి, సాండుప్‌ లెప్చ, భీమ్‌ హంగ్‌ లింబూ, భోజ్‌రాజ్‌ రాయి, జిటి ధుంగెల్‌, పురన్‌ కుమార్‌ గురుంగ్‌, పింత్సో నాంగ్యాల్‌ లెప్చ, నార్‌ బహదూర్‌ దహల్‌, రాజు బస్నెట్‌, థేండుప్‌ భూటియా ఉన్నారు.

➡️