- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధ
- ఘనంగా రాజ్యాంగ వ్రజోత్సవ వేడుకలు
న్యూఢిల్లీ : రాజ్యాంగ స్ఫూర్తితో కార్యనిర్వాహక వ్యవస్థ, చట్ట సభలు, న్యాయ వ్యవస్థ సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల జీవితాలు మెరుగుపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ సదన్ (పాత పార్లమెంట్ భవనం)లో రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ దేశానికి మూలగ్రంధమైన రాజ్యాంగంలో ప్రతి పౌరుడి ప్రాథమిక విధులకు స్వష్టమైన నిర్వచనముందని, దేశ ఐక్యత, సమగ్రత, సామరస్యం, మహిళల గౌరవాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి ఇవి నిర్దేశించినట్లు ఆమె తెలిపారు. కార్యనిర్వహక, చట్టసభ, న్యాయవ్యవస్థలతో పాటు ప్రజలంతా కూడా సక్రమంగా విధులను నిర్వర్తించినప్పుడే రాజ్యాంగ ఆదర్శాలు పరిపుష్టి అవుతాయని చెప్పారు. న్యాయవ్యవస్థను మరింత ప్రభావంతంగా మార్చేందుకు సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నాలు హర్షనీయమన్నారు.
రాజ్యాంగ గౌరవం కాపాడేందుకు కృషి : మోడీ
రాజ్యాంగం గౌరవాన్ని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సిబిఎ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానన్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తదితరులు ప్రసంగించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీని చూశామని, ప్రజాస్వామ్యం ముందు తలెత్తిన ఇలాంటి ఎన్నో సవాళ్లను రాజ్యాంగం అధిగమించిందన్నారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2023-24ను మోడీ విడుదల చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం తరువాత శక్తివంతమైన ప్రజాస్వామ్య, భౌగోళిక రాజకీయ నేతగా భారత్ ఉద్భవించిందని, ఈ పరివర్తనకు దేశ రాజ్యాంగం ఎంతో సహాయపడిందని తెలిపారు. దేశ విభజన, తీవ్రమైన నిరక్షరాస్యత, పేదరికం, ప్రజాస్వామ్యానికి పరీక్షలు వంటి పరిణామాల తర్వాత భారత్ స్వీయ-హామీ కలిగిన దేశంగా మారిందన్నారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, ఎస్‌సిబిఎ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తదితరులు ప్రసంగించారు.