బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి : సుప్రీంకోర్టు

Apr 12,2025 15:36 #Supreme Court

న్యూఢిల్లీ : రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాగా, ఇటీవల సుప్రీంకోర్టు తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవికుమార్‌ ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ ఆమోదించకుండా ఉన్న పది బిల్లులను సుప్రీంకోర్టు ఆమోదం తెలుపుతున్నట్లు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు చెప్పింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే ప్రథమం.

➡️