వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాధిస్తాం

  • లోక్‌సభలో ప్రధాని మోడీ
  • ప్రతిపక్షాలపై ఎదురుదాడి
  • సమస్యలపై సమాధానాలు కరువు
  • పార్లమెంట్‌లో ఢిల్లీ ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రపతి ప్రసంగం ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంపై దేశ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని, మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చల అనంతరం మంగళవారం ప్రధాన మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలోని సమస్యలు, సవాళ్లను ప్రస్తావించకుండా, ప్రతిపక్షాలపై విమర్శలకే ఆయన ప్రసంగం పరిమితమైంది. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఎదురుదాడికి దిగారు. దీంతో ఆయన ప్రసంగం ఆసాంతం ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికి, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికి ఉపయోగపడింది. రైతుల సమస్యలు, నిరుద్యోగం, ధరలు పెరుగుదల వంటి అంశాలను పూర్తిగా విస్మరించారు. అందుకనే ఆయన ప్రసంగంపై ప్రతిపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రసంగం చేశారు. ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను విమర్శించడంతో ఓట్ల కోసం చేసిన ప్రసంగంలా ఉంది.

నరేంద్రమోడీ మాట్లాడుతూ ‘మనం 2025లో ఉన్నాం. ఒక రకంగా 21వ శాతాబ్దంలో 25 శాతం ముగిసిపోయింది. 20వ శతాబ్దంలో స్వాతంత్య్రం తరువాత, 21వ శతాబ్దంలో 25 ఏళ్లలో ఏం జరిగిందనేది కాలమే చెబుతుంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, రాబోయే 25 ఏళ్లలో, వికసిత్‌ భారత్‌ దిశగా ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పే దిశగా పనిచేయనున్నాం. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబింబించింది. సరికొత్త ధీమాను కల్పిస్తూ, సామాన్య ప్రజానీకానికి స్ఫూర్తిగా నిలిచింది’ అని మోడీ అన్నారు. తమ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇవ్వదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని అన్నారు. 25 లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. పేదలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి సవాళ్లను అవగాహన చేసుకుని, వాటిని అధిగమించేలా చేసేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు.

ప్రధాని తన ప్రసంగంలో రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పేదల గుడిసెల్లో ఫొటో సెషన్లతో సరదాగా గడిపేవారికి పార్లమెంటులో పేదల గురించి మాట్లాడుతూ చేసే ప్రసంగాలు బోర్‌గానే ఉంటాయని అన్నారు. కొందరు నాయకులు విలాసవంతమైన షవర్లు కోరుకుంటారని, తమ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికీ నీళ్లు ఇవ్వడంపై దృష్టి సారిస్తుందని కేజ్రీవాల్‌ విలాసవంతమైన శీష్‌ మహల్‌ (అద్దాల మేడ)పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామాలకు 16 పైసలే చేరుతోందని గతంలో ఒక ప్రధాని వాపోయారని, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అప్పట్లో అదే పరిస్థితి ఉండేదని ప్రధాని అన్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోందని, నగదు బదిలీతో నేరుగా ప్రజలకే సొమ్ము అందుతోందని వివరించారు. డిజిటల్‌ సాంకేతికతను పారదర్శకంగా ఉపయోగించడంతో పది కోట్ల నకిలీ ఖాతాలను తొలగించామన్నారు.

➡️