న్యూఢిల్లీ : ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఇటీవలి ఉక్రెయిన్ సందర్శనను ప్రస్తావించారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు శాంతియుత పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
”ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సంభాషించాం. ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై చర్చించాం. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై దృక్కోణాలు మరియు ఇటీవలి ఉక్రెయిన్ పర్యటనపై నా పరిశీలనలను పరస్పరం పంచుకున్నాం. సంఘర్షణకు స్థిరమైన, శాంతి యుత పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించాం” అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పర్యటనకు ముందు గత జులై నెలలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు. భారత్ -రష్యా ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు.