ప్రధాని మోడి తొలి విదేశీ పర్యటన – ఈ నెల 14న ఇటలీకి..!

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మోడి తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ 7 కూటమి సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 14 న ప్రధాని మోడి ఇటలీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహం అయిన జీ 7 సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇటలీ పిఎం జార్జియా మెలోని గత ఏప్రిల్‌ నెలలో ప్రధాని మోడిని ఆహ్వానించారు. దీనికి సమ్మతించిన ఆయన మెలోనికి కృతజ్ఞతలు కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధాల ప్రభావం, తదితర అంశాలపై చర్చించనున్నారు. కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యూకే, అమెరికా ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సదస్సుకు జీ 20 ఫోరమ్‌లోని దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ కూడా హాజరుకానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడి సమావేశమయ్యే అవకాశం ఉన్నది. కాగా, ఈ నెల 15న స్విట్జర్లాండ్‌లో ఉక్రెయిన్‌ శాంతి సమావేశం జరుగుతున్నది. దానికి మోడి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. జూన్‌ 14న జీ 7 సమావేశంలో పాల్గొననున్న ప్రధాని.. వెంటనే భారత్‌కు తిరిగిరానున్నారు.

➡️