ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎంపిగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే ఆమె చేత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం తొలుత తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభలోకి ప్రవేశించిన తరువాత లోక్‌సభ సెక్రటరీ జనరల్ ప్రియాంక గాంధీ పేరు పిలవగానే ఆమె చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టడం తకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌తోపాటు ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎంపిగా గెలుపొందారు. ప్రియాంకతో పాటు నాందేడ్ ఎంపిగా గెలుపొందిన రవీంద్ర వసంతరావు చవాన్ కూడా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.