వాయనాడ్‌ లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక

ఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రెండు రోజులు (శని, ఆదివారం) వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప ఎన్నికల్లో వాద్రా వాయనాడ్‌ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఓటర్లకు ఈ పర్యటనలో కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. వీరిద్దరూ శనివారం ఉదయం 11 గంటలకు కోజికోడ్ విమానాశ్రయంనకు చేరుకుంటారు. కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి అసెంబ్లీ నియోజకవర్గంలోని మధ్యాహ్నం 12 గంటలకు ముక్కాంలో బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం మలప్పురం జిల్లాలోని కరులై, వండూరు, ఎడవన్నలలో రిసెప్షన్ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదివారం వాయనాడ్‌ జిల్లాలోని మనంతవాడి, సుల్తాన్ బతేరి, కల్పేటలో జరిగే స్వాగత కార్యక్రమాలకు వాద్రా హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఆమె కోజికోడ్‌ నుంచి ఢిల్లీకి పార్లమెంట్‌ సమావేశాల నిమిత్తం వెళ్లనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిటీ జనరల్‌ కన్వీనర్‌ ఎ.పి. అనిల్‌ కుమార్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

➡️