న్యూఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండనున్నట్లు ఊహాగానాలు ఊపందుకన్నాయి. అయితే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని, భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం ఉందని రాబర్ట్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన సోమవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లో రానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గాంధీ కుటుంబంలో సభ్యుడిని కాబట్టే.. నాకు రాజకీయాలతో అనుబంధం ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చాలా పార్టీలు నా పేరును ఉపయోగించుకున్నాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ వారు నా పేరును ప్రస్తావిస్తారు. నన్ను రాజకీయాల్లోకి లాగుతారు. రాజకీయ వేట ప్రతీకార చర్యగా భావించబడుతుందని ఆయన అన్నారు.
నా భార్య ప్రియాంక, బావమరిది రాహుల్ గాంధీల నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. వారు పార్లమెంటు చర్చల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. పార్లమెంటుకు ప్రియాంక వెళ్లాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. ప్రియాంక బాగా కష్టపడుతుంది. ప్రియాంక, రాహుల్.. వారి కుటుంబం నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నా కుటుంబ సభ్యులు ఆశీర్వాదం.. కాంగ్రెస్ పార్టీ నేను రాజకీయాల్లోకి రావాలని భావిస్తే.. కచ్చితంగా నేను ముందడుగు వేస్తాను. రాజకీయాల్లోకి వస్తాను. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో.. ఏ మార్పు అవసరమో నాకు బాగా అర్థమైందని వారికి తెలుసు అని ఆయన అన్నారు.
మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ వంటి ఆర్థిక మోసగాళ్లను దేశానికి రప్పించి.. తీసుకున్న డబ్బును తిరిగి రప్పించడం ముఖ్యం. ప్రభుత్వం ఆవిధమైన చర్యలు తీసుకోవాలి అని వాద్రా ఇంటర్వ్యూలో అన్నారు.
