(అదాని కుంభకోణంపై మాజీ కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి ఇఎఎస్ శర్మ కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖ .. ఆయన మాటల్లోనే)
కేంద్ర ఆర్థికశాఖా మాత్యులు నిర్మలా సీతారామన్ గారికి,
భారత దేశంలోనూ, అమెరికాలో కూడా గౌతమ్ అదానీ, మరికొందరు దురుద్దేశపూర్వకంగా చట్టవ్యతిరేకంగా ఆర్థికనేరాలకు పాల్పడినట్టు అమెరికన్ జిల్లా కోర్టు చేసిన నేరారోపణను నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఆ క్రమంలో ఉభయ దేశాల్లోని మదుపుదారుల దృష్టికి రాని విధంగా లంచగొండితనానికి, అవినీతికి గౌతమ్ అదానీ తదితరులు పాల్పడ్డారని ఆ ఆరోపణ పేర్కొంది.
అమెరికాలో జిల్లా కోర్టు, సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ అక్కడి చట్ట వ్యవస్థ అధికారులు. అమెరికాలో ఎస్‌ఇసి మాదిరిగానే భారతదేశంలో సెబి (సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కూడా ఇక్కడి అధికార వ్యవస్థ. అందుచేత అమెరికాలో అక్కడి అధికార వ్యవస్థలు చేసిన ఆరోపణలను ఇక్కడ మొత్తంగా తోసివేయడం కుదరదు. ఐతే ఇప్పటివరకూ మీరు, మీ సహచరులు అదే చేస్తూవస్తున్నారు. ఎఫ్‌బిఐ సంస్థ అటు అమెరికాలో, ఇటు ఇండియాలో చాలా శ్రమకోర్చి సాక్ష్యాధారాలను సేకరించి ఆ ప్రాతిపదికన ఈ నేరారోపణ చేసింది.
మన మదుపరులకేది రక్షణ?
అమెరికన్ మదుపరుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం, అవినీతిని నిరోధించడం కోసం అదానీ గ్రూపు మీద చర్యలు తీసుకోడానికి ఎస్‌ఇసి సిద్ధపడుతోంది. అదే మాదిరిగా ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెబి, సిబిఐ, ఇడి తదితర సంస్థలు కూడా మన మదుపరుల ప్రయోజనాలను, ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రం బ్యాంకుల ప్రయోజనాలను, అంతకన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు నిధులను సమకూర్చే మన టాక్స్ పేయర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి పూనుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిరంతరం ఆత్మరక్షణ దశలో పడిపోయి, ఎంతసేపూ నిరాకరించడమే పనిగా పెట్టుకున్న మీ మంత్రిత్వ శాఖ ఎందుకు పక్షవాతంతో పడివుందో వివరణకు కూడా అందని స్థితి ఉంది. దీని ఫలితంగా దేశీయ మదుపరుల, దేశీయ టాక్స్ పేయర్ల ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయి.
ఈ అదానీ ఉదంతం దురదృష్టవశాత్తూ దేశంలోను, రాష్ట్రాలలో సైతం వ్యవస్థలు కుప్పకూలిపోయాయని సూచిస్తున్నది. దీని ప్రభావం ఇంతింతై ఇటు దేశీయంగా టాక్స్ పేయర్లను మోసం చేయడంతోబాటు, అటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది, ఏ పాపమూ ఎరుగని విద్యుత్ వినియోదారుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. నా దృష్టిలో ఆందోళన కలిగిస్తున్న విషయాలను దిగువన ఇస్తున్నాను:
1. దేశం లోని ఆ యా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు తాము వినియోగించే మొత్తం విద్యుత్తు లో కనీసం 10 శాతాన్ని అదానీ గ్రూపు వంటి కార్పొరేట్ సంస్థలు స్థాపించిన కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి, విదేశీ సంస్థ అయిన ఎజ్యుర్ నుంచి ఎంత ఖరీదుకైనా సరే కొనుగోలు చేయాల్సిందేనని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 2003 విద్యుత్ చట్టం లోని సెక్షన్ 11 కింద ఇచ్చిన ఈ ఆదేశం చట్ట విరుద్ధం. ఈ ఆదేశాల ద్వారా కేంద్రమే అవినీతికి అవకాశాలు కల్పించింది. ఇప్పుడు ఆ రెండు సంస్థలూ అమెరికన్ కోర్టు లో నేరారోపణను ఎదుర్కొంటున్నాయి. భవనాల పైకప్పులమీద ఏర్పాటు చేయగల చిన్న చిన్న సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా, వ్యవసాయ మోటారు పంపుసెట్లను నడిపించగల ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తిని, పంపిణీని వికేంద్రీకరించే విధానానికి బదులు కేంద్రీకృతంగా భారీ సౌర విద్యుత్ ప్లాంట్లను కార్పొరేట్లు నిర్వహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖే స్వయంగా పూనుకోవడం కన్నా అన్యాయం ఉండదు. కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్లు స్వత:సిద్ధంగానే ఆర్థికంగా లాభసాటిగా నడవడం అసాధ్యం. వీటికి ఎక్కువ పెట్టుబడులు అవసరం అవుతాయి. చాలా తక్కువ లోడ్ ఫాక్టర్‌తో వీటిని నడపాలి. ఉత్పత్తి జరిగే స్థలం నుంచి వివిధ ప్రాంతాలకు విద్యుత్తును పంపిణీ చేసే క్రమంలో చాలా విద్యుత్తును నష్టపోవలసివస్తుంది. ఈ నష్టం అంతా వినియోదారులే భరించాల్సివస్తుంది. లదే వినియోగ దారుల గృహాలమీద గనుక సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే వారే తిరిగి విద్యుత్ గ్రిడ్ కు అమ్ముకునే వీలుంటుంది. దాని వలన వారిమీద పడే భారం తగ్గుతుంది. గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ సౌర విద్యుత్ ప్లాంట్ల వ్యవహారాన్ని గనుక సమీక్షిస్తే వీటిని ఏర్పాటు చేయడం వెనుక ఎంత పెద్ద స్థాయిలో రాజకీయ అవినీతి చోటు చేసుకుందో స్పష్టంగా కనపడుతుంది. 2022 ఎలక్ట్రసిటీ(సవరణ) చట్టం 2022 లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ”రెన్యుబుల్ ఎనర్జీ ఆబ్లిగేషన్” పేరుతో ఒక క్లాజ్ ను చేర్చడానికి ప్రయత్నించింది. దాని ప్రకారం వినియోదారులమీద ఏటికేడాదీ చార్జీలు పెరిగే విధానం అమలౌతుంది. వినియోదారులకు అది ఊహకందనంత పెనుభారం అవుతుంది. వినియోగదారులను బలిపెట్టి కార్పొరేట్లకు సేవ చేయడమే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏకైక లక్ష్యం లా కనిపిస్తోంది. (జాతీయ స్థాయిలో జరిగిన చరిత్రాత్మక రైతుల పోరాటం వలన ఈ సవరణ చట్టం రద్దు అయింది)
ఈ నేపధ్యంలో ప్రస్తుతం గౌతమ్ అదాని అభేద్యమైన ఒక కోటలోపల ఉన్నవాడిలా భద్రంగా రక్షింపబడుతూవున్నాడని నాకనిపిస్తోంది. ప్రజా ప్రయోజనాలను, జాతీయ ప్రయోజనాలను కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు ఆ బాధ్యతను విస్మరించి, అదాని సామ్రాజ్యాన్ని బహు జాగ్రత్తగా కాపలా కాస్తున్నాయి. అధికార రాజకీయ పార్టీ పల్లకీ మోసేవారు, దాని భట్రాజులు అదాని గ్రూపు చేస్తున మోసాలను సమర్ధిస్తూ, అదేదో కొన్ని ప్రతిపక్ష రాష్ట్రాలకు పరిమితమైన కుంభకోణంగా చిత్రిస్తున్నారు. అందులో కేంద్రానికి ఎటువంటి పాత్రా లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అదానీ గ్రూపు భారతీయ ”స్వావలంబన”కు ప్రతీక అయినట్టు, ”విదేశాల”నుండి దానికి సవాలు ఎదురైతే అదేదో మన దేశ స్వావలంబనకే ముప్పు అన్నట్టు అభివర్ణిస్తూ ఈ కుంభకోణానికి ”దేశభక్తి” రంగు పులుముతున్నారు. తద్వారా వాస్తవాలను మసకబరచి ప్రజానీకాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం లో ప్రధాన స్థానాల్లో ఉన్నవారు ఎప్పుడు విదేశాల్లో పర్యటించినా, ఈ బడా కార్పొరేట్ సంస్థలనే మన దేశ వ్యాపార, పారిశ్రామిక శక్తి అన్నట్టు చూపిస్తున్నారు. అందుచేత ఆ బడా సంస్థలు ఏ విధమైన తప్పుడు పద్ధతులను అనుసరించినా దాని ఫలితంగా దెబ్బ తినేది మన దేశ ప్రతిష్టే. అంతర్జాతీయంగా మన పరువు ప్రతిష్టలు నిలబడాలంటే ఈ కుంభకోణం మీద దర్యాప్తు ఎంత తొందరగా ఆదేశిస్తే అంత మంచిది.
బడా కార్పొరేట్ సంస్థలు బాగా పని చేయగలుగుతున్నాయా అన్నది ప్రభుత్వ సమర్ధతకు ఋజుత్వం కాబోదు. ఏ మేరకు చట్టబద్ధంగా పాలన సాగింది, ఏ మేరకు ప్రజా ప్రయోజనాలను రక్షించగలిగారు అన్న దానిని బట్టి సుపరిపాలన అనేది నిర్ధారించబడుతుంది.
సెబి మీద ఇటీవల వచ్చిన ఆరోపణల విషయంలో గాని ఇతర ఆరోపణలమీద గాని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. దీని తర్వాత ఒకవేళ ఇప్పుడు తీరుబడిగా ఈ విషయంలో మీ మంత్రిత్వ శాఖ విచారణ మొదలుపెట్టినా దానికి ఏ విశ్వసనీయతా ఉండబోదు.
అదాని గ్రూపు మీద అమెరికన్ కోర్టు చేసిన ఆరోపణలు ప్రజల దృష్టికి వచ్చిన మరుక్షణమే మా ”పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెెక్టర్ అండ్ పబ్లిక్ సర్వీసెస్” ( పిసిపిఎస్‌పిఎస్) కు చెందిన మాలో కొంతమంది ఒక ప్రకటన జారీ చేశాం. అందులో ఈ విధంగా డిమాండ్ చేశాం:
రెండు వైపులా వడ్డింపు
2. విద్యుత్ మంత్రిత్వ శాఖతో బాటే కూడబలుక్కున్నట్టు ఎంఎన్‌ఆర్‌ఇ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ ) అదానీ గ్రీన్, ఎజ్యుర్ తదితర కార్పొరేట్ కంపెనీలకు, అవి లాభాలార్జిస్తున్నప్పటికీ, విచ్చలవిడిగా సబ్సిడీల పేరుతో ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఇందుకోసం ప్రత్యేకించి స్కీములు రూపొందించింది. ఆ స్కీముల్లో వినియోదారులు భరించలిగే విధంగా చార్జీలు ఉండాలన్న నిబంధనలు ఏవీ లేవు. ఈ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లను బట్టి చూస్తే అదానీ సంస్థకు రు.863 కోట్లు, ఎజ్యుర్ కు రు.186 కోట్లు చెల్లించినట్టు ఉంది. ఈ సొమ్మంతా బడ్జెట్ నుంచే కేటాయించారు. అంటే టాక్స్ పేయర్ల సొమ్ము ఇది. మరోవిధంగా చెప్పాలంటే, టాక్స్ పేయర్ల సొమ్మును సబ్సిడీల రూపంలో మళ్ళిస్తున్నారు. ఇంకోవైపు వినియోదారులుగా అదే టాక్స్ పేయర్లు ఎక్కువ ఖరీదు చెల్లించి విద్యుత్తు కొనుగోలు చేయవలసివస్తోంది. అంటే రెండు వైపులా వడ్డింపు అన్నమాట. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి జవాబుదారీ తనమూ ఉన్నట్టు కనిపించడంలేదు.
3. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇ సిఐ-సెకి) ఇదే కార్పొరేట్లనుంచి విద్యుత్తును ఎక్కువ ఖరీదుకు కొనుగోలు చేసి బలవంతంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు అంటగట్టే బ్రోకర్ గా తయారైంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కొందరు ఆ కార్పొరేట్లతో లాలూచీ పడి ఖరీదైన విద్యుత్తును కొని వినియోదారులమీద ఆ భారాన్నంతటినీ రుద్దే విధంఆ ఒప్పందాలు చేసుకోడానికి అవకాశం ఏర్పడింది.
చర్యలు ఏవీ!
4. వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం కోసం ఏర్పడిన కేంద్ర, రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీస్ అధికధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకున్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలమీద ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కార్పొరేట్లు వినియోదారులను కొల్లగొడుతూంటే ఈ సంస్థలు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయాయి.
5. అమెరికన్ దర్యాప్తు సంస్థలు, అక్కడి ఎస్‌ఇసి, అదానీ గ్రూపు సంస్థలమీ దర్యాప్తు చేపట్టినట్టు వార్తలు ఏడాది క్రితమే వార్తలు వచ్చాయి. మీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే సెబి గనుక స్పందించివుంటే, మన దేశీయ స్టాక్ మార్కెట్ లోని మదుపుదారుల ప్రయోజనాలను పరిరక్షించే ఆలోచనే ఉంటే, వెంటనే అమెరికాలోని ఎస్‌ఇసి ని సంప్రదించివుండాలి. ఆ వెంటనే ఇక్కడ కూడా తగు చర్యలు తీసుకుని వుండాలి. ఈ విషయం లో అదానీ సంస్థ కాని, ఎజ్యుర్ కాని సెబి ముందు వాస్తవాలు వెల్లడించారా? చట్టప్రకారం ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఆ కంపెనీలకు ఉంది. ఇదేదీ జరగలేదు. అంటే సెబి మదుపుదారుల ప్రయెజనాల రక్షణ విషయంలో తన బాధ్యతను ఉల్లంఘించినట్టు కాదా? ఈ ముఖ్యమైన ప్రశ్నలకు సెబి సమాధానాలు చెప్పాల్సిందే.
అదానిపై నియంత్రణ లేదా?
6.సెబి చైర్‌పర్సన్ కు అదానీ గ్రూప్ తో పరోక్షంగా లింకులు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లడయ్యాయి. కాని ఆమె తనకు తానే ఏదోషమూ లేదన్న సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. సెబి నిబంధనల ప్రకారం పదవుల్లో ఉన్నవారి వ్యక్తిగత ప్రయోజనాలు సెబి విశాల ప్రయోజనాలకు భిన్నంగా ఉండే సందర్భాల్లో పాటించవలసిన విధానాలను విస్మరించారు. మీరు, మీ సహచరులు శిలావిగ్రహాలమాదిరిగా నిశ్చేష్టంగా ఉన్నారు. ఒక నియంత్రణ సంస్థగా సెబి ప్రతిష్ట మీద ఆధారపడి దేశీయ స్టాక్ మార్కెట్ పట్ల ప్రజల విశ్వాసం ఉంటుందన్న వాస్తవాన్ని కూడా విస్మరించారు. సెబి అందరిపైనా నియంత్రణ చలాయిస్తోంది కాని అదానీ గ్రూపు వరకు, తనవరకు వచ్చేసరికి ఆ నియంత్రణ ఏదీ లేకపోవడం విస్మయం కలిగిస్తుంది. నేను గతంలో కూడా పలుమార్లు ఈ విషయం మీద లేఖలు రాసినా, మీరు ఎటువంటి చర్యలూ తీసుకోనేలేదు.
7. అదాని గ్రూపు కు సంబంధించి మరికొన్ని దర్యాప్తుల ప్రతిపాదనలు కూడా సెబి ముందు ఉన్నాయి. కాని ఇంతవరకూ అవేవీ వెలుగు చూడనేలేదు. సెబి ని ఏదైనా అదృశ్య హస్తం ప్రభావితం చేస్తోందా?
దర్యాప్తు సంస్థల ప్రేక్షక పాత్ర
8. ప్రతిపక్ష పార్టీలలోని రాజకీయ నాయకుల విషయంలో క్షణాలమీద సిబిఐ, ఇడి, డిఆర్‌ఐ, ఇన్‌కంటాక్స్ అధికారులు రంంలోకి దిగిపోతున్నారు. కాని, అదానీ విషయంలో మాత్రం ఏడాది క్రితమే వార్తలు వెలువడ్డా ఇంతవరకూ ఆ దర్యాప్తు సంస్థల ఉలుకూ లేదు, పలుకూ లేదు. అదాని గ్రూపు బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి పరికరాల ధరలను కృత్రిమంగా పెంచి చూపిన విషయమై దర్యాప్తు కొనసాగుతోంది. అదే విధంగా సోలార్ పానెల్స్ కొనుగోలు ధరలను. సౌరవిద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో అధిక ధరలను చూపించిన విషయాల్లో కూడా దర్యాప్తు మొదలైంది. కాని ఈ దర్యాప్తులన్నీ ముందడుగు పడకుండా వెనక్కి పోయాయి.
9. భారతదేశంలో విద్యుత్ వినియోదారులు అనేక విధాలుగా మోసగించబడుతున్నారు. కేంద్ర బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలు కూడబలుక్కుని కృత్రిమంఆ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరతను గత కొన్ని సంవత్సరాలుగా సృష్టించడం కూడా వాటిలో ఒకటి. ఆ వెంటనే ఇంధన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి తనకు అధికారం లేకపోయినా, సెక్షన్ 11 ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. వాటి ప్రకారం రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గు కొరతను పూడ్చడానికి బొగ్గు దిగుమతి చేసుకోవాలి. ఆ విదేశీ కంపెనీల యజమానులు దేశీయ కార్పొరేట్లే నన్న సంగతి ఇంధన శాఖ కు బాగా తెలుసు. విదేశీ కంపెనీలు చుక్కలనంటే ధరలకు బొగ్గును రాష్ట్ర సంస్థలకు అమ్ముతున్నాయి. ఆ భారం మళ్ళీ వినియోదారులపైనే భారీగా పడుతోంది. ఇదంతా ఒక లోతైన పథకం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల రాజకీయ నాయకుల పాత్రతో సాగుతున్న కుంభకోణం. బొగ్గు కొరత కొనసాగుతూనేవుంది. కుంభకోణం కూడా సాగుతూనేవుంది. ఈ మహా మోసంలో ఏమీ తెలియని వినియోగదారులు మాత్రం మోసపోతూనేవున్నారు.
సమగ్ర విచారణ జరిపించండి
ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో అదాని వ్యవహారం మీద సిబిఐ, ఇడి, డిఆర్‌ఐ, సిబిడిటి వంటి దర్యాప్తు సంస్థలతో సమగ్రమైన విచారణ చేపట్టాలి. దేశీయంగాను, విదేశాలలోను సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఈ విచారణ జరగాలి. ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలకు నష్టం, బడా కార్పొరేట్లకు అనుకూలం అయిన ఇటువంటి విధానాలను ఏ పరిస్థితుల్లో చేపట్టాయన్నది, రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు చట్టవిరుద్ధంగా ఏ విధంగా ఆదేశాలను జారీ చేశాయన్నది ఆ విచారణలో భాగంగా ఉండాలి. అవినీతి, మోసాలు వీటి కారణంగానే సాధ్యం అయ్యాయి. ఆ విచారణలో విద్యుత్ వినియోగదారులమీద ఈ అవినీతి, మోసాల కారణంగా ఎంత భారం పడిందో ఆ మొత్తాన్ని నిర్ధారించాలి. ఏవిధంగా వినియోగదారులకు పరిహారం చెల్లించాలో తేల్చాలి. ఇటువంటి కుంభకోణాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఎటువంటి శిక్షలు, అపరాధ రుసుములు విధించాలో నిర్ణయించాలి. అంతేగాక, ఈ కుంభకోణంలో కేంద్ర మంత్రులు, సెబి తదితర సంస్థలు పోషించిన పాత్ర ఏమిటో తేల్చాలి. అటువంటివి భవిష్యత్తులో జరిగేవీలు లేకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు, దిద్దుబాట్లు చేపట్టాలో తేల్చాలి.
ఆ విచారణ కమిషన్ నివేదికను ఆరు మాసాలలోఆ పార్లమెంటుముందు ప్రవేశపెట్టాలి.
మా కమిషన్ అభిప్రాయాలను, ఆందోళనను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పట్టించుకోకుండా ఉంటే పర్యవసానాలు తీవ్రంగా మారుతాయని నా అభిప్రాయం. మొండిగా అదానీ గ్రూపును సమర్ధిస్తూ, సెబి పోషించిన పాత్రను బలపరుస్తూవుంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఉంచిన నమ్మకం మరింతగా దిజారిపోతుంది.
పైన వివరించిన విషయాలు చాలా తీవ్రమైన ప్రభావం కలిగించేవి. వాటిమీద ప్రజల్లో చర్చలు పెద్దఎత్తున జరగాలని భావిస్తున్నాను.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు కూడా ఈ లేఖ ప్రతిని పంపుతున్నాను. పై లేఖలో వ్యక్తం అయిన అంశాలమీద వారు సమంగా ఆడిట్ నిర్వహించాలని ఆశిస్తున్నాను.
ప్రజలమధ్య చర్చలు జరిగేందుకు వీలుగా ఈ లేఖను బహిరంగంగా విడుదల చేస్తున్నాను.
- ఇఎఎస్ శర్మ