అమరావతి బ్యూరో : రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని తీవ్రం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రాజా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 9న అమిత్ షా క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ స్థాయిలో తీర్మానాలు, అంబేద్కర్ విగ్రహాల పాదాల వద్ద అమిత్ షా పేరుతో రాజీనామా లేఖలు సమర్పించడం, 10న విశాఖపట్నంలో గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష, 11న విజయవాడలో రౌండ్ టేబుట్ సమావేశం, 12న నియోజకవర్గ స్థాయిలో ఆర్‌టిసి బస్సులు, మార్కెట్ స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో రాజ్యాంగ ప్రకటనల పంపిణీ, 22న జిల్లా స్థాయిలో అంబేద్కర్ విగ్రహాల వద్దకు పాదయాత్ర, 23న నియోజకవర్గ స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వెలుపల రాజ్యాంగ ప్రకటనల పంపిణీ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.