మైనార్టీలకు భద్రత కల్పించండి : సిఐటియు

Nov 30,2024 01:35 #CITU, #minorities, #Provide security

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌ – న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రత, మైనార్టీల భద్రతకు ముప్పుగా జరుగుతున్న ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలపై సిఐటియు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనార్టీల రక్షణకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వాన్ని సిఐటియు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిఐటియు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో మతపరమైన విభజనలు సృష్టించేందుకు మతతత్వ శక్తులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నా, ఈ దాడుల నుంచి మైనార్టీలను రక్షించడానికి, మత సామరస్యం, శాంతిని నెలకొల్పడానికి అక్కడి అధికారులు, ప్రభుత్వం ఎటువంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడం లేదని సిఐటియు తన ప్రకటనలో విమర్శించింది. మరోవైపు భారత్‌లో మతోన్మాద శక్తులు బంగ్లాదేశ్‌లో పరిస్థితి గురించి క్రూరమైన, రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్నాయని సిఐటియు ఆందోళనను వ్యక్తం చేసింది. ఇదే శక్తులు దేశంలోని ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసకుని దేశ ఐక్యత, సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించింది. ప్రజల జీవితాలను, ఉపాధిలను చిధ్రం చేస్తున్న నయాఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటలను ఇలాంటి మత రాజకీయాలు బలహీనం చేస్తాయని, అలాగే ఇలాంటి మతరాజకీయాలు బంగ్లాదేశ్‌లోనే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా సరే శ్రామిక వర్గానికి హాని కలిగిస్తాయని సిఐటియు స్పష్టం చేసింది. ఇలాంటి మత రాజకీయాలను ప్రతీచోటా శ్రామిక వర్గాలు ప్రతిఘటించాలని సిఐటియు పిలుపునిచ్చింది.

➡️