పాండిచ్చేరి : పుదుచ్చేరిలో మరో చిన్నారికి హెచ్‌ఎంపివి పాజిటివ్‌గా నిర్ధారణైనట్లు ఉన్నతాధికారి ఒకరు సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పుదుచ్చేరిలోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన జిప్మర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బాలిక దగ్గు, జ్వరం, జలుబుతో కొద్ది రోజుల క్రితం జిప్మర్‌లో చేరిందని పుదుచ్చేరి ఆరోగ్య డైరెక్టర్ వి. రవిచంద్రన్ ఆదివారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నారి కోలుకుంటుందని, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. గతవారం పుదుచ్చేరిలో మొదటి హెచ్‌ఎంపివి కేసు వెలుగుచూసింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారి చికిత్స అనంతరం శనివారం డిశ్చార్జ్ అయిందని సంబంధిత అధికారులు తెలిపారు. పూర్తి అప్రమత్తతో అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.
