పంజాబ్‌-హర్యానా సరిహద్దు మూసివేత – 13న ‘ఢిల్లీ ఛలో’కు రైతుల పిలుపు

అంబాలా/పాటియాలా : ఓ వైపు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు దానిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దును మూసివేశారు. అంబాలా, పాటియాలా పోలీసులు తమ తమ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. వాహనాలను వేర్వేరు మార్గాల్లో పంపుతున్నారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని, స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అంబాలాలోని శంభూ టోల్‌ప్లాజా సమీపంలో వాహనాలను ఆపేందుకు వీలుగా సిమెంట్‌ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న పాటియాలా-శంభూ సరిహద్దు వద్ద వాహనాల రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. శంభూ నుండి అంబాల వెళ్లే వాహనాలను కూడా అడ్డుకుంటున్నారు. నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాల్లో నిరసనలకు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ-నోయిడా సరిహద్దులో గురువారం పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు భారీగా మోహరించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైతుల నిరసన నేపథ్యంలో ముగ్గురు మంత్రులతో కూడిన బృందం చండీఘర్‌లో రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపింది.

 

➡️