Punjab : ఠాకుర్ద్వారా ఆలయంలో పేలుడు.. శాంతి భద్రతలకు విఘాతం : సిఎం భగవంత్‌మాన్‌

అమృత్‌సర్‌ : గురువారం రాత్రి అమృత్‌సర్‌ ఖాండ్వాలాలోని ఠాకూర్ద్వారా ఆలయంలో పేలుడు సంభవించింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆలయంలోకి పేలుడు పదార్థాన్ని విసిరేయడంతో ఈ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్షసాక్షి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సిసిటివిఫుటేజీలో రికార్డయింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుడు ఘటనలో పాకిస్తాన్‌ ఇంటెల్‌ ఏజెన్సీ (ఐఎస్‌ఐ) హస్తం ఉందని అమృత్‌సర్‌ కమిషనర్‌ జిపిఎస్‌ బుల్లార్‌ అనుమానం వ్యక్తంచేశారు.
కాగా, ఈ పేలుడు ఘటనపై పంజాబ్‌ సిఎం భగవంత్‌మాన్‌ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పంజాబ్‌లో శాంతిని దెబ్బతీసేందుకు ఎల్లప్పుడూ అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, గ్యాంగ్‌స్టర్లు, దోపిడీ ఇలాంటివన్నీ ఇందులో భాగమే. పంజాబ్‌ ఒక కల్లోలిత రాష్ట్రంగా మారిందని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హోలీ పండుగ సమయంలో ఇతర రాష్ట్రాల్లో పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. కానీ పంజాబ్‌లో అలాంటివి జరగలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుంది’ అని ఆయన అన్నారు.

➡️