సిపిఎం ఎంపి రాధాకృష్ణన్
తిరువనంతపురం : కేరళలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థుల అణిచివేతకు ఇడి వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుందని సిపిఎం ఎంపి కె రాధాకృష్ణన్ శుక్రవారం విమర్శించారు. కర్వువన్నూర్ కోపరేటివ్ బ్యాంక్ స్కాం కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాలని రాధాకృష్ణన్‌కు ఇడి నోటీసులు జారీచేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎంపి పైవిధంగా స్పందించారు. అలాగే తనకు ఇచ్చిన నోటీసులో కర్వువన్నూర్ కోపరేటివ్ బ్యాంక్ స్కాం కేసు అని పేర్కొనలేదని, దానికి బదులుగా తన బ్యాంక్ అకౌంట్లు, భూమి వివరాలతో సహ తన ఆస్తుల వివరాలు సమర్పించాలని అడిగారని ఎంపి తెలిపారు. ‘ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల కారణంగా సంస్థ ముందు విచారణకు హాజరుకాలేనని నేను ఒక లేఖ పంపాను. సమావేశాల తరువాత విచారణకు హాజరవుతాను’ ఎంపి తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం కర్వువన్నూర్ కోపరేటివ్ బ్యాంక్‌లో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని రాధాకృష్ణన్‌కు ఇడి నోటీసులు జారీ చేసింది. సిపిఎం నియంత్రణలో ఉన్న ఈ బ్యాంక్‌లో రూ. 150 కోట్ల విలువైన అక్రమాలు జరిగాయని త్రిస్సూర్‌లోని కేరళ పోలీసు క్రైం బ్రాంచ్‌లో నమోదైన 16 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి ఈ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.