న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభలో తనపై చేసిన అవమానకర వ్యాఖ్యల్ని తొలగించాలని స్పీకర్ ఓంబిర్లాను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యాను. సభలో నాపై చేసిన అవమానకర వ్యాఖ్యల్ని తొలగించమని ఆయనను కోరాను. స్పీకర్ పరిశీలిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. సభ సజావుగా జరగాలి, చర్చ జరగాలన్నదే మా లక్ష్యం. నా గురించి ఏం మాట్లాడినా డిసెంబర్ 13న సభలో చర్చ పెట్టాలనుకుంటున్నాము. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై సభలో బిజెపి చర్చను కోరుకోవడం లేదు. ఈ విషయంపై మేము వదిపెట్టము. వారు మాపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. కానీ సభ తప్పక నడుస్తుంది’ అని ఆయన అన్నారు.
కాగా, బిజెపి ఎంపీలు రాహుల్‌గాంధీని టార్గెట్ చేస్తూ లోక్‌సభలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల లోక్‌సభలో బిజెపి ఎంపి నిషికాంత్ దూబె ‘కాంగ్రెస్ కా హాత్, సోరోస్ కే సాత్ అని ఆయన వ్యాఖ్యానించారు. జార్జ్ సోరెస్ నుండి నిధులు కాంగ్రెస్ నిధులు పొందిందని, రాహుల్ జోడో యాత్ర కోసమే సోరెస్ నుంచి డబ్బులు తీసుకున్నారా? అని ఆయన విమర్శించారు. అలాగే బిజెపికి చెందిన మరో ఎంపి సంబిత్ పాత్ర రాహుల్‌గాంధీని ద్రోహి అని అన్నారు. అయితే సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ‘జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని ద్రోహులు అని పిలిచేవారు.. రాహుల్‌గాంధీని కూడా ద్రోహి అనే పిలుస్తారు. అందులో సందేహం లేదు. అయినా నా సోదరుడిని చూసి నేను గర్విస్తున్నాను. నేనే కాదు.. దేశం కూడా గర్విస్తుంది అని ఆమె బిజెపి నేతలకు గట్టిగా సమాధానమిచ్చారు.
