అదానీ, అంబానీల కోసం పనిచేసే ప్రధానిలా కాదు : రాహుల్‌ గాంధీ

May 13,2024 17:44 #PM Modi, #Rae Bareli, #Rahul Gandhi

న్యూఢిల్లీ :    అదానీ, అంబానీల కోసం పనిచేసే ప్రధాని మోడీలా కాదని, రాయ్‌బరేలీ ప్రజల కోసం తన కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సోమవారం రాయ్‌బరేలీలో మొదటిసారి ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  తన నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌ గాంధీ, తల్లి సోనియాగాంధీలు రాయ్‌బరేలీ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని అన్నారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) పథకం కోసం 24 ఏళ్లకు కేటాయించిన నగదుకు సమానమైన రూ. 16 లక్షల కోట్ల రుణాలను మోడీ ప్రభుత్వం కేవలం 22-25 పారిశ్రామికవేత్తల కోసం మాఫీ చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగ యువత, రైతుల సమస్యలను మీడియా పట్టించుకోవడం లేదని, పెట్టుబడిదారుల కుటుంబాల్లో పెళ్లి వేడుకలకు ప్రాముఖ్యతనిస్తోందని దుయ్యబట్టారు.

గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన రాయ్‌బరేలీ నియోజకవర్గానికి 2004 నుండి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వయసు రీత్యా ఆమె ప్రత్యక్ష ఎన్నికల నుండి తప్పుకున్నారు.  దీంతో ఈ స్థానం నుండి రాహుల్‌ గాంధీ బరిలోకి దిగారు.

➡️