న్యూఢిల్లీ : పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఆరు రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు ”క్రమబద్ధమైన వైఫల్యమని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ”తీవ్రమైన సమస్య” పరిష్కారమౌతుందని అన్నారు. పేపర్ లీకేజీ యువతకు ప్రమాదకరమైన పద్మవ్యూహంగా మారిందని గురువారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
కష్టపడి చదివే విద్యార్థులను, వారి కుటుంబాలను ఈ లీకేజీలు అనిశ్చితిలోకి నెడుతున్నాయని, తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తున్నాయని అన్నారు. కష్టానికి తగిన ఫలితం లేకపోతే.. కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీ లేకపోవడమే మంచిదనే తప్పుడు సందేశం తరువాతి తరానికి వెళ్తుందని అన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
దేశాన్ని కుదిపేసిన నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి ఏడాది కూడా కాలేదని, ఈ అంశంపై తీవ్రమైన నిరసనలు చేపట్టామని అన్నారు., నిరసనల తర్వాత మోడీ ప్రభుత్వం ఒక కొత్త చట్టం పేరుతో దాక్కుందని, ఇదే పరిష్కారమని ప్రక టించి చేతులు దులుపుకుందని అన్నారు. కానీ ఇటీవలి లీకేజీలు ఆ చట్టం వైఫల్యాన్ని నిరూపించాయని అన్నారు. పరీక్షలు విద్యార్థుల హక్కు, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలని స్పష్టం చేశారు.