న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణ గురువారం వాయిదా పడింది. ఆయన తరపు న్యాయవాది అస్వస్థతకు గురికావడంతో ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 11కి వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి శుభమ్‌వర్మ పేర్కొన్నారు. 2018 కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బిజెపి నేత పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, తనకు వ్యక్తిగతంగా హాని కలిగించాయని పేర్కొన్నారు.
రాహుల్ కోర్టుకు హాజరుకాకపోవడంతో, 2023 డిసెంబర్‌లో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2024 ఫిబ్రవరిలో రాహుల్ కోర్టులో లొంగిపోయారు. అదే ఏడాది జులై 26న కోర్టు ఆయన స్టేట్ మెంట్‌ను రికార్డు చేసింది. రూ.25,000 చొప్పున ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది.
ఈ కేసు రాజకీయ కుట్రలో భాగమని రాహుల్ గాంధీ వాదిస్తున్న సంగతి తెలిసిందే.