నేడు రాయ్‌బరేలీలో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ

Jun 11,2024 12:35 #Congress MP, #Raebareli, #Rahul Gandhi

లక్నో : కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని  రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలనుద్దేశించి ఏర్పాటు చేసిన ‘ అభార్‌ సభ ‘ (కృతజ్ఞత సభ) లో ప్రసంగించనున్నారు.   రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, ఎఐసిసి జనరల్‌ కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపి కె.ఎల్‌. శర్మలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంగళవారం మొదటిసారి కాంగ్రెస్‌ అధిష్టానం ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండటం గమనార్హం.

ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ -సమాజ్‌ వాది పార్టీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు జూన్‌ 11 నుండి 15 వరకు మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ధన్యవాద బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. యుపిలోని 80 లోక్‌సభ స్థానాలకు గాను ఇండియా ఫోరం 43 స్థానాల్లో విజయం సాధించింది. వాటిలో సమాజ్‌ వాదీ పార్టీ 37 సీట్లు, కాంగ్రెస్‌వి 6 సీట్లు ఉన్నాయి.

ఇటీవల  లోక్‌సభ ఎన్నికల్లో  రాయ్‌బరేలీలో బిజెపి అభ్యర్థి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌పై రాహుల్‌ గాంధీ 3,90,030 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అమేథీలో కాంగ్రెస్‌ నేత కె.ఎల్‌ శర్మ 1,67,196 ఓట్ల తేడాతో స్మృతి ఇరానీని ఓడించారు.

➡️