K Armstrong : కె ఆర్మ్‌స్ట్రాంగ్‌ మృతికి రాహుల్‌, స్టాలిన్‌లు సంతాపం

Jul 6,2024 12:47 #armstrong, #BSP, #rahul, #Stalin, #tamilnadu

చెన్నై : తమిళనాడు బహుజన సమాజ్‌పార్టీ (బిఎస్‌పి) రాష్ట్ర అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్‌ శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ‘తమిళనాడు బిఎస్‌పి చీఫ్‌ తిరు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా హత్యచేయడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ హత్య కేసులో తమిళనాడు ప్రభుత్వం దోషులను త్వరగా న్యాయస్థానం ముందుకు తీసుకువస్తుందని నేను విశ్వసిస్తున్నాను.’ అని రాహుల్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ఆర్మ్‌స్ట్రాంగ్‌ మృతికి తమినాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తీవ్ర విచారకరమని స్టాలిన్‌ అన్నారు. బిఎస్‌పి పార్టీ సభ్యులకు, ఆర్మ్‌స్ట్రాంగ్‌ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులందరికీ స్టాలిన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కేసును త్వరగా దర్యాప్తు నిర్వహించి దోషులను పట్టుకుని, న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని పోలీసు అధికారులను సిఎం స్టాలిన్‌ ఆదేశించారు.
ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో చెన్నై పోలీసులు ఎనిమిది నిందితులను గుర్తించారు. ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

➡️