రాహుల్‌ దాడి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌పైనే

Jul 3,2024 02:10 #BJP and RSS, #Rahul's attack
  • హిందువులపై దాడిగా వక్రీకరిస్తున్నసంఘ్ పరివార్‌
  • సంసద్‌ టీవీ ఛానల్‌లో ప్రసంగంలో స్పష్టీకరణ

న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హిందూ సమాజాన్ని అవమానించారంటూ ఢిల్లీ నుండి గల్లీ వరకూ సంఫ్‌ు పరివార్‌ నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. రాహుల్‌ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. అసలు రాహుల్‌ ఏమన్నారు? ఆయన యావత్‌ హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని కించపరిచారా? పదకొండ సెకన్ల పాటు కన్పించిన వీడియో క్లిప్‌లో రాహుల్‌ హిందీలో ‘తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్న వారు రోజుకు 24 గంటలూ హింస, విద్వేషం గురించే మాట్లాడుతున్నారు. అసత్యాలు చెబుతున్నారు’ అని మాత్రమే అన్నారు.

నిర్మల వ్యాఖ్యలు
రాహుల్‌ ప్రసంగ వీడియోను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ షేర్‌ చేశారు. దానికి ఆమె రాసిన వ్యాఖ్య ఇలా ఉంది…’తనను తాను హిందువుగా పిలుచుకునే ప్రతి వ్యక్తినీ రాహుల్‌ హింసావాదిగా చిత్రించారు. ఇది హిందువుల పట్ల ఇండియా కూటమికి ఉన్న ద్వేషభావాన్ని, ధిక్కారాన్ని చూపుతోంది. ఇండియా కూటమిలోని ఆయన భాగస్వాములు కూడా హిందూ ద్వేషాన్ని నింపుకున్నారు. తమది ప్రేమ దుకాణమని చెప్పుకోవడంలో వారి కపటత్వం బయటపడింది’.

అధికారిక ఛానల్‌లో ప్రసంగం
ఈ వివాదం వెనుక అసలు వాస్తవమేమిటో పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాహుల్‌ తన ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. రాహుల్‌ పూర్తి ప్రసంగ పాఠాన్ని సంసద్‌ టీవీ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ‘రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు : 18వ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ’ అనే శీర్షిక కింద రాహుల్‌ ప్రసంగం ఉంది.

రాహుల్‌ ఏమన్నారు?
గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం ఓ పథకం ప్రకారం రాజ్యాంగంపై దాడి చేస్తోందని రాహుల్‌ తన ప్రసంగంలో విమర్శించారు. ఆ తర్వాత ఆయన శివుని చిత్రపటం గురించి మాట్లాడారు. భయాన్ని ఎలా జయించాలో, అహింసను ఎలా ఆచరించాలో తాను, ఇతర ప్రతిపక్ష నేతలు శివుడి నుండి నేర్చుకున్నామని తెలిపారు. అనంతరం ఆయన ‘అభయముద్ర’ గురించి మాట్లాడారు. ఇతరులను భయపెట్టవద్దని, వారిలో నెలకొన్న భయాన్ని పారద్రోలాలని, అహింసావాదులుగా మారేందుకు ఇతరులకు సాయపడాలని చెప్పారు. అన్ని మతాలు ధైర్యాన్ని గురించి చెబుతాయని అన్నారు. భయాన్ని వీడి అభయముద్రను ముందుకు తీసికెళ్లాలని ఇస్లాం, సిక్కిజం, క్రైస్తవం, జైనిజం ఉద్బోధించాయని వివరించారు. ‘ఇతరులను చూసి భయపడవద్దని, ఇతరులను భయపెట్టవద్దని శివుడు చెప్పాడు. ఆయన అభయముద్రను చూపాడు. అహింసను గురించి మాట్లాడి తన త్రిశూలాన్ని నేలపై గుచ్చాడు. తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్న వారు రోజులో 24 గంటలూ హింస, ద్వేషం గురించి మాట్లాడుతున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. మీరు హిందువులు కారు. సత్యం వైపు నిలవాలని, దాని నుండి వెనక్కి మళ్లరాదని హిందూయిజం చెబుతోంది. నిజాన్ని చూసి భయపడవద్దని, అహింసే మన చిహ్నమని కూడా చెబుతోంది’ అని రాహుల్‌ తన ప్రసంగంలో చెప్పారు.

మోడీ హితవు
అయితే రాహుల్‌ ప్రసంగాన్ని ప్రధాని మోడీ తప్పుపట్టారు. ఆయన యావత్‌ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోకూడదని హితవు పలికారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, యావత్‌ హిందూ సమాజాన్ని హింసావాదులుగా చిత్రించడం చాలా తీవ్రమైన విషయమని చెప్పారు.

➡️