చండీగఢ్ : వచ్చే నెల ఐదో తేదీన జరిగే హర్యానా శాసనసభ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 30 నుంచి రాష్ట్రంలో యాత్ర చేపట్టబోతున్నారు. ప్రియాంక గాంధీ కూడా ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం 30వ తేదీ ఉదయం 11 గంటలకు నారాయణ్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గంలో యాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు కురుక్షేత్రలో ముగుస్తుంది. ఏడు నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అక్టోబర్ 3న ప్రచారం ముగిసే లోగా మరికొన్ని నియోజకవర్గాలలో కూడా రాహుల్ యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఇది పాదయాత్ర కాదని, రోడ్ షో వంటిదని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు.