Rajasthan : కాంగ్రెస్‌ మాజీ మంత్రి ఇంట్లో ఇడి సోదాలు

జైపూర్‌ : రాజస్థాన్‌లోని అధికార బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కాంగ్రెస్‌ నేత ఇంట్లో ఇడి దాడులు ప్రారంభించింది. మంగళవారం జైపూర్‌లోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలోని రాజస్థాన్‌ మాజీ మంత్రి ప్రతాప్‌సింగ్‌ ఖచారియావాస్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ సిఎంగా ఉన్న హయాంలో ప్రతాప్‌ రవాణా శాఖకు మంత్రిగా వ్యవహరించారు. ఇడి దాడులపై ప్రతాప్‌ మాట్లాడుతూ.. ‘నాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఇడి అధికారులు నా నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నా వద్ద దాచడానికి ఏమీ లేదు. ఇడి అధికారులకు నేను పూర్తిగా సహకరిస్తాను. ఇడి తన పని తాను చేసుకుంటోంది. నేనెవరికి భయపడను. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి ఇంటికి ఇడి అధికారులు వస్తారు’ అని ఆయన అన్నారు.
కాగా, కాంగ్రెస్‌ నేత ఇంటిపై దాడులు నిర్వహించడంతో.. ఆయన నివాసం వద్ద ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ప్రతాప్‌సింగ్‌ మద్దతుదారులు ఆయన నివాసానికి చేరుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇటీవల ప్రతాప్‌సింగ్‌.. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాలు మారతాయి. కాలం మారుతుంది. రాహుల్‌గాంధీ అధికారంలోకి వస్తే.. బిజెపికి ఏం జరుగుతుందో ఊహించుకోండి. మేము ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎన్ని సోదాలు కావాలంటే.. అన్ని చేయవచ్చు. మేము భయపడము అని ప్రతాప్‌సింగ్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల అనంతరమే.. తాజాగా ఆయన ఇంటిపై ఇడి దాడులు నిర్వహించడం గమనార్హం.

 

➡️