ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని ఒక స్థానంతోపాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికకు సంబంధించి ఆగస్టు 14న ఇసి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. అస్సోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు. బీహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27 వరకు గడువు ఇచ్చారు. సెప్టెంబరు 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.
దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అస్సోం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.
