న్యూఢిల్లీ : ‘ఈ రోజు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు’ అన్న ఆత్మ విశ్వాసంతో ప్రశాంతంగా నిద్రపోతానని రతన్‌టాటా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త, టాటాగ్రూప్స్ మాజీ చైర్మన్ రతన్‌టాటా బుధవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. అవినీతి నివారణపై రతన్‌టాటా 2010లో ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది.
అవినీతిని అరికట్డం గురించి తనకు, ఓ సన్నిహితుడైన బిలియనీర్‌కు మధ్య జరిగిన సంభాషణను రతన్‌టాటా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బహిరంగపరచని ఓ వ్యాపార ఒప్పందం కోసం ఓ మంత్రికి రూ.15 కోట్లు చెల్లించాలని బిలియనీర్ సూచించారని అన్నారు. తాను తిరస్కరించడంతో, అవినీతిని ఎలా అరికడతావని ఆ బిలియనీర్ ప్రశ్నించారు. ‘అది స్వీయ నియంత్రణ అని, నీకు ఎప్పటికీ అర్థం కాదని’ చెప్పినట్లు టాటా తెలిపారు. ఈ రోజు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న ఆత్మ విశ్వాసంతో ప్రశాంతంగా నిద్రపోతానని టాటా పేర్కొన్నారు.