పిల్లల వార్డులో ఎలుకలు

  • మధ్యప్రదేశ్‌లోని ఒక ఆస్పత్రిలో ఘటన
  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
  • నెటిజన్ల ఆగ్రహం

భోపాల్‌ : ఆస్పత్రులు అంటేనే పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. కానీ బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో ఆస్పత్రుల పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఒక ఆస్పత్రిలోని పిల్లల వార్డులో రోగి బెడ్‌ వద్ద అనేక సంఖ్యలో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రంలోని ఆస్పత్రుల పరిస్థితులపై ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నదని ఆరోపిస్తున్నారు. సదరు ఆస్పత్రిలో పరిశుభ్రత, నిర్వహణపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో విస్తృతంగా వైరల్‌ కావటంతో ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పును ఒప్పుకున్నది. ఈ సమస్యను పరిష్కరించటం కోసం కఠినమైన ప్రయత్నాలను అమలు చేస్తామని వివరించింది. ”మేము క్రమం తప్పకుండా పెస్ట్‌ కంట్రోల్‌ను నిర్వహిస్తాం. సమస్య మాత్రం అలాగే ఉంటే.. కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆస్పత్రి రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ ఉయ్కే అన్నారు. ఈ ఘటనపై స్పందించిన సీనియర్‌ జిల్లా అధికారి.. పిల్లల వార్డును సందర్శించారు. సదుపాయాలను మరింతగా పెంచుకోవాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్‌ ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ మంత్రి సంపతీయ ఉయ్కే స్పందించారు. ఆస్పత్రిని సందర్శించారు. ఘటనను నిర్లక్ష్యపు చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ను ఆదేశించారు.

➡️