సిపిఎం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శిగా రవిశంకర్‌ మిశ్రా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర నూతన కార్యదర్శిగా రవిశంకర్‌ మిశ్రా ఎన్నికయ్యారు. 35 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక కాగా, 11 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నికైంది. మూడు రోజుల పాటు బులంద్‌షహర్‌లో జరిగిన సిపిఎం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర 24వ మహాసభ మంగళవారం ముగిసింది. ఈ మహాసభకు సిపిఎం సమన్వయ కర్త ప్రకాష్‌ కరత్‌, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలి, కేంద్ర కమిటీ సభ్యులు అమ్రారామ్‌, విక్రమ్‌ సింగ్‌ హాజరయ్యారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి హీరాలాల్‌ రాజకీయ, నిర్మాణ నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం 35 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. నూతన కార్యదర్శిగా రవిశంకర్‌ మిశ్రా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా హీరాలాల్‌ యాదవ్‌, డిపి సింగ్‌, ముకుత్‌ సింగ్‌, ప్రేమనాథ్‌ రారు, మధు గార్గ్‌, బిఎల్‌ భారతి, సురేంద్ర సింగ్‌, బాబూరామ్‌ యాదవ్‌, చంద్రపాల్‌ సింగ్‌ తదితరులు ఎన్నికయ్యారు.

ప్రజల్లో విభేదాలు సృష్టించేందుకు ఆలయ వివాదాలు ప్రకాశ్‌కరత్‌

సిపిఎం సమన్వయకర్త ప్రకాశ్‌ కరత్‌ మాట్లాడుతూ మసీదుల కింద దేవాలయాలున్నాయనే వివాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పారు. ప్రజల్లో విబేధాలు సృష్టించడానికి జరిగే కుట్రలో భాగంగానే ఈ వివాదాలను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు తీసుకొస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుత సమయంలో ప్రతిపక్షాల ఐక్యత చాలా ముఖ్యమని అన్నారు. దేశంలో మోడీ సర్కార్‌ ప్రజలపై భారాలను వేస్తోందని, అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేస్తోందని విమర్శించారు. రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత ఇలా ఏ సమస్య కేంద్ర ప్రభుత్వానికి పట్టదని అన్నారు. నిరుద్యోగం పెరిగిందని, ధరలు పెరుగుదల మునుపెన్నడూ లేనంతగా ఉందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం మత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలను విచ్ఛిన్నం చేస్తోందని అన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా సిపిఎంను నిర్మించడంతోపాటు బలమైన వామపక్ష ఐక్యతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.

➡️