RBI: పదో ‘సారీ’!

Oct 9,2024 23:06 #RBI, #repo rate
  • కీలక వడ్డీ రేట్లు తగ్గించని ఆర్‌బిఐ

న్యూఢిల్లీ : ప్రస్తుత పండుగ సీజన్‌లో అయినా అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన రుణ గ్రహీతలకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి నిరాశనే మిగిల్చింది. వరుసగా పదో సారి కూడా వడ్డీ రేట్లను హెచ్చు స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ మానిటరింగ్‌ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీ బుధవారంతో ముగిసింది. అనంతరం ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచేందుకు ఆరుగురు ఎంపిసి సభ్యుల్లో ఐదుగురు అనుకూలంగా ఓటు వేశారని ఆయన చెప్పారు. గతంలో 2023 ఫిబ్రవరిలో చివరిసారి రెపో రేటును ఆర్‌బిఐ మార్చింది. మరోవైపు బేసిస్‌ పాయింట్లు పలు దఫాలు పెంచింది. దీంతో వడ్డీ, వాయిదా చెల్లింపులు ఎక్కువై రుణాలు భారం అయ్యాయి. దసరా సందర్భంగానైనా వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వినియోగదారులు ఆశించారు.
యుపిఐ లైట్‌ పరిమితి పెంపు
డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి ఆర్‌బిఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పిన్‌ లేకుండానే చెల్లింపులు చేయడానికి ఉపయోగించే యుపిఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితిని రూ.2వేల నుంచి రూ.5వేలకు పెంచింది. అదే విధంగా నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌), రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ (ఆర్‌టిజిఎస్‌) చెల్లింపుల్లోనూ ఇకపై గ్రహీత పేరు కనిపించేలా నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ తెలిపారు.

➡️