సుప్రీం తీర్పు సారాన్ని గ్రహించండి

  • కేరళ గవర్నర్‌ వ్యాఖ్యలపై ఎంఎ బేబి

న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని సారాంశాన్ని అందరు గవర్నర్లు గ్రహించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విలువలను కాపాడుతుందని చెప్పారు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా కేరళ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమైనవని అన్నారు. ఈ తీర్పు రాష్ట్రపతిసహా అందరికీ వర్తిస్తుందని చెప్పారు. కేరళ గవర్నర్‌ సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను అడ్డుకునే అధికారం గవర్నర్‌కు లేదని చెప్పారు. అది లోపభూయిష్టంగా ఉందని మీరు భావిస్తే, మీరు దానిని తిరిగి పంపించాలని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పార్లమెంటు ఆమోదించిన చట్టాలను రాష్ట్రపతి అడ్డుకోరని గుర్తు చేశారు. ”రాష్ట్రపతికి లేని అధికారం గవర్నర్‌కు ఏముంది?” అని ఎంఎ బేబి ప్రశ్నించారు.

➡️