– 92 చేరిన మృతుల సంఖ్య
గౌహతి : అస్సాంలో వరద పరిస్థితి కొద్దిగా తగ్గింది. అయితే తాజాగా మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తంగా వరద సంబంధిత మరణాల సంఖ్య 92కు చేరుకుంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎఎస్‌డిఎంఎ) బుధవారం విడుదల చేసిన వివరాల ప్రకారం వరద ప్రభావిత జిల్లాల సంఖ్య వారం కిందట 30 ఉండగా, మంగళవారం నాటికి 26కి తగ్గింది. ”26 వరద బాధిత జిల్లాల్లోని 2,779 గ్రామాల్లో దాదాపు 17.18 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 39,870.3 హెక్టార్ల పంట భూములు మునిగిపోయాయి. ప్రస్తుతం 507 సహాయ శిబిరాల్లో దాదాపు లక్ష మంది ఆశ్రయం పొందుతున్నారు’ అని ఎఎస్‌డిఎంఎ పకటనలో తెలిపింది. బ్రహ్మపుత్ర, బుర్హిదిహింగ్, దిఖౌ, దిసాంగ్, కోపిలి, కుషియారా వంటి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని అధికార ప్రతినిధి తెలిపారు. కజరింగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లో వరద నీరు తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. అయితే ఇంకా వరద ప్రభావం ఉందని చెప్పారు.
