Case : నిర్మలా సీతారామన్‌, జెపి నడ్డాలపై కర్ణాటకలో ఎఫ్‌ఐఆర్‌

  • ఎన్నికల బాండ్ల కేసులో న్యాయస్థానం ఆదేశాలతో చర్యలు

బెంగళూరు : ఎన్నికల బాండ్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తదితరులపై కర్ణాటకలోని తిలక్‌నగర్‌ పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎన్నికల బాండ్ల పేరుతో పలువురు పారిశ్రామికవేత్తలను, ఇతర ప్రముఖులను నిర్మలా సీతారామన్‌, ఇతర బిజెపి పెద్దలు బెదిరించి ఆ పార్టీకి నిధులు వచ్చేలా చేశారంటూ… జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్‌ ఆర్‌ అయ్యర్‌ ఈ ఏడాది మార్చి 30న తిలక్‌నగర్‌ పోలీసులను మొదట ఆశ్రయించారు. వారు స్పందించకపోవడం తో బెంగళూరు సౌత్‌ ఈస్ట్‌ డిసిపిని ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఎంపిలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసుల కోసం ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంతోశ్‌ గజానన హెగ్డే నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను శుక్రవారం ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ అక్టోబరు 10న చేపట్టనున్నారు. ప్రత్యేక న్యాయ స్థానం ఆదేశాల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), జెపి నడ్డాతో సహా బిజెపి కర్ణాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర, సీనియర్‌ నాయకులు నలీన్‌ కుమార్‌ కటీల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎలక్టోరల్‌ బాండ్ల నెపంతో రూ.8 వేల కోట్లకుపైగా నిందితులు లబ్ధిపొందారని ఆదర్శ్‌ ఆరోపించారు. పలువురు కార్పొరేట్లు, ఆయా కంపెనీల సిఇఒలు, ఎమ్‌డిలు, టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లపై దాడులు , ఆస్తుల స్వాధీనం, అరెస్టులకు ఇడిని నిర్మలా సీతారామన్‌ ఒక సాధనంగా వాడుకున్నారని ఫిర్యాదు దారుడు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దాడులకు భయపడి చాలామంది కార్పొరేట్లు కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయాల్సి వచ్చిందని, వాటిని నడ్డా, కటీల్‌ విజయేంద్ర తదితరులు సొమ్ము చేసుకున్నారని పేర్కొన్నారు.

➡️