డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ రూల్స్‌ విడుదల

న్యూఢిల్లీ : డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ – 2023 నిబంధనల అమలుకు సంబంధించిన ముసాయిదా కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ చట్టం 14 మాసాల కిందటే ఆమోదించినా నిబంధనలను ఇప్పటివరకూ రూపొందించలేదు. ముసాయిదా పై ఫిబ్రవరి 18 వరకూ ప్రజల అభిప్రాయాలను తీసుకుంటారు. డేటా సేకరించేటప్పుడు వినియోగదారులకు అందించాల్సిన నోటీసు స్వభావాన్ని ముసాయిదా నియమాలు పేర్కొంటున్నాయి. కొన్ని ప్రమాణాలకు లోబడి, ప్రభుత్వం, సంబంధిత శాఖలు సమాచారాన్ని సేకరించవచ్చునని ముసాయిదా తెలిపింది. స్టాటస్టికల్‌ అవసరాల కోసం సమాచార సేకరణకు మినహాయింపునిచ్చింది. పిల్లల వ్యక్తిగత సమాచారం తీసుకోవాల్సి వస్తే ముందుగా లేదా ఆన్‌లైన్‌లో తల్లిదండ్రుల సమ్మతిని తీసుకోవాలని స్పష్టం చేసింది. ముసాయిదాలో జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగించే కొన్ని నిబంధనలున్నాయి. వ్యక్తిగత డేటా భారత భూభాగం వెలుపలకు బదిలీ చేయబడదు. 2023లో ఉన్న చట్టంలో ఆమోదించబడిన పెనాల్టీ ప్రస్తావన ఈ ముసాయిదాలో లేదు. గరిష్టంగా జరిమానా విధించే నిబంధన ఉంది.

➡️