వెల్లివిరిసిన మత సామరస్యం

Feb 4,2025 00:08 #kumbh mela, #Muslim services
  • కుంభమేళాలో ముస్లింల సేవలు

ప్రయాగ్‌రాజ్‌ : దేశంలో కుల, మత రాజకీయాలు పెట్రేగుతున్న వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మత సామరస్యం వెల్లివిరిస్తోంది. పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తుండగా అక్కడి యోగి సర్కార్‌ ఏర్పాటు చేసిన(మరుగుదొడ్లు, ఇతర) సహాయక కార్యక్రమాలు ఆశించిన మేర సరిపోవడం లేదు. దీంతో ఇది ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. ఇలాంటి సమయంలో అక్కడి ముస్లింలు ముందుకొచ్చి సాయమందిస్తున్నారు.
సుదూర ప్రాంతాలనుంచి కుంభమేళాకు వచ్చిన వారికి తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకోవటం పెద్ద సమస్యగా మారింది. ఇక మహిళల అవస్థలైతే చెప్పలేనివి. ఇవన్నీ గుర్తించిన ప్రయాగ్‌రాజ్‌లోని ముస్లింలు.. తామున్నామంటూ ముందుకొచ్చారు. తమ వంతు సహాయ సహకారాలందిస్తున్నారు. సాధారణంగా హిందూ ఆలయాల్లో ముస్లింలను అనుమతించరు. కానీ ఇక్కడ సీన్‌ మరోలా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం జరుగుతుంటే.. సర్కారు అందించే సేవలు మాత్రం అంతంతగానే ఉండడంతో ముస్లింలు .. మసీదుల్లో, తమ ఇళ్లలో హిందు భక్తులకు ఆశ్రయమిస్తున్నారు. శీతాకాలం కావటం… మంచుకురుస్తుండడంతో పిల్లలు, మహిళలు వణికిపోతున్నారు. కాస్తంతా చోటు దొరికితే చాలు అనుకుంటున్న వారికి, తమ స్థోమతకు తగ్గట్టు ముస్లింలు వసతి సౌకర్యం కల్పించడంతో పాటు భోజనాలు, దుప్పట్లు, కంబలి ఇలా ఏది ఉంటే అది ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దేశమంతటా మతరాజకీయాల చిచ్చు పెరుగుతున్న సమయంలో మాకు ఇంతలా సేవలందిస్తారని ఊహించలేదని పలువురు పేర్కొనటం గమనార్హం. అక్కడ ముస్లింలు అందిస్తున్న ఈ సేవలను స్థానిక కార్పొరేట్‌ మీడియా మరుగునబెడితే..బిబిసి, ఇతర అంతర్జాతీయ మీడియా హైలెట్‌ చేయటం విశేషం.

➡️