ప్రఖ్యాత ఆర్థికవేత్త, చరిత్రకారుడు అమీయ కుమార్‌ బాగ్చి కన్నుమూత

కోల్‌కతా : ప్రఖ్యాత మార్క్సిస్టు ఆర్థికవేత్త, చరిత్రకారుడు ప్రొఫెసర్‌ అమీయ కుమార్‌ బాగ్చి గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో దక్షిణ కోల్‌కతాలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో బోధనా వ్యాసంగంతో ఆయన కెరీర్‌ ప్రారంభమైంది. న్యాయం కోసం మాట్లాడినందుకు ఆయన తొలుత చేరిన కాలేజీ నుండి బయటకు రావాల్సి వచ్చింది. తర్వాత కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. ఆ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేసిన బగ్చి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ స్కాలర్‌షిప్‌పై 1960ల్లో కేంబ్రిడ్జి యూనివర్శిటీకి వెళ్లి డాక్టరేట్‌ను పూర్తి చేశారు. అనంతరం జీసస్‌ కాలేజీ ఫెలోషిప్‌తో ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పాలిటిక్స్‌లో చేరారు. 1969లో ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రెసిడెన్సీ కాలేజీలో తన అకడమిక్‌ కెరీర్‌ను చేపట్టారు. తొలుత ఆయన గణిత ఆర్థికవేత్తగా విశ్లేషణలు సాగించిన ఆయన తదనంతరం ఆర్థిక చరిత్రను అధ్యయనంపై దృష్టి సారించి ఎన్నో అమూల్యమైన పుస్తకాలు, వ్యాసాలు రచించారు. ఆయన చిట్టచివరి అద్బుతమైన రచన పెరిలస్‌ ప్యాసేజ్‌ : మేన్‌కైండ్‌ అండ్‌ ది గ్లోబల్‌ అసెండెన్సీ ఆఫ్‌ కేపిటల్‌. అంతర్జాతీయంగా పేద,వర్ధమాన దేశాల అనుభవాలను ఆయన ఆ పుస్తకంలో వివరించారు. ప్రధానంగా సామ్రాజ్యవాదం వల్ల సంభవించిన ప్రజా పతనాలపై దృష్టి కేంద్రీకరించారు. 1974లో కలకతాలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌లో చేరారు. భారత బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ చరిత్రలో బాగ్చి ప్రత్యేక కృషి చేశారు. 1976 నుండి 1998 వరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అధికార చరిత్రకారునిగా వ్యవహరించారు. ఎస్‌బిఐ ఆర్కైవ్‌లను భావితరాల కోసం భద్రపరచడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 2001లో కలకత్తాలోని సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ సోషల్‌సైన్సెస్‌ నుండి ఆర్‌బిఐ ప్రొఫెసర్‌గా రిటైరైన తర్వాత ఆయన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరించారు.

సిపిఎం సంతాపం

ప్రొఫెసర్‌ అమీయ కుమార్‌ బాగ్చి మృతి పట్ల సిపిఎం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. వామపక్ష ఉద్యమంతో ఆయనకు విడదీయరాని అనుబంధం వుందని అరుణాంజలి ఘటించింది. పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి అనేక అంశాలపై ఆయన విధానపరమైన సలహాదారునిగా వున్నారని పేర్కొంది. ఆయన అందించిన సేవలు, చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు తీవ్రంగా సానుభూతి తెలియజేసింది.

➡️