– సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కోటీశ్వర్ సింగ్
– జస్టిస్ మహదేవన్‌కు కూడా పదోన్నతి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తొలిసారి మణిపూర్‌కు ప్రాతినిధ్యం దక్కింది. ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సర్వోన్నత న్యాయస్థానంలో మణిపూర్ వ్యక్తి న్యాయమూర్తి కావడం ఇదే తొలిసారి. జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌తో పాటు ఆర్ మహాదేవన్ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. వీరు ఇరువురికి పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే ప్రతిపాదనలు చేసింది. ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త నియామకాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.
జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన మణిపూర్ తొలి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. 1986లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన కోటీశ్వర్ సింగ్ కూడా మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా చేశారు. గౌహతి, మణిపూర్ హైకోర్టుల్లో పని చేశారు.
జస్టిస్ మహాదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. చెన్నైలో జన్మించిన మహాదేవన్ మద్రాసు న్యాయ కళాశాలలోనే న్యాయ విద్య పూర్తి చేశారు. న్యాయవాదిగా దాదాపు తొమ్మిది వేల కేసులను ఆయన వాదించారు. తమిళనాడు అదనపు ప్రభుత్వ ప్లీడర్‌గా చేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది సేవలందించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
