ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ.. సిడబ్ల్యుసి తీర్మానం

Jun 9,2024 08:42 #Congress, #rahul

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీని నియమించాలని కోరుతూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) తీర్మానం చేసింది. శనివారం నాడిక్కడ అశోక హౌటల్‌లో సిడబ్ల్యుసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్‌, గౌరవ్‌ గొగోరు సహా సిడబ్ల్యూసి సభ్యులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం ఆ పార్టీ సీనియర్‌ నేత వేణుగోపాల్‌ మీడియా సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి చేపట్టాలని రాహుల్‌ని సిడబ్ల్యుసి ఏకగ్రీవంగా కోరిందని తెలిపారు. పార్లమెంటు లోపల ప్రతిపక్షానికి నాయకత్వం వహించడానికి రాహుల్‌ సరైన వ్యక్తి అని అన్నారు. ”కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా చేసిన భారత్‌ జోడో యాత్ర, భారత్‌ జోడో న్యారు యాత్ర కాంగ్రెస్‌ ను దేశ ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఆయన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లలో ఆశలు, విశ్వాసాన్ని ఈ రెండు యాత్రలు నింపాయి” అని సిడబ్ల్యుసి తీర్మానంలో పేర్కొన్నారు.”రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం సింగిల్‌ మైండెడ్‌ గా, పదునైనదిగా, సూటిగా సాగింది. 2024 ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశంగా ఆయన చేశారు. ఎన్నికల ప్రచారంలో చాలా శక్తివంతంగా ప్రతిధ్వనించిన పాంచ్‌ న్యారు-పచీస్‌ హామీ కార్యక్రమం రాహుల్‌ యాత్రల ఫలితం. ఇందులో ప్రజలందరి భయాలు, ఆందోళనలు, ఆకాంక్షలను, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసిలు, ఒబిసిలు, మైనారిటీల ఆకాంక్షలు ప్రతిబింబించాయి” అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని స్వీకరించడానికి రాహుల్‌ గాంధీ అంగీకరించారా? అని ప్రశ్నించగా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ చెప్పారు. తమ నాయకుడు, కార్యకర్తలను ఉత్సాహపరచడంతో కాంగ్రెస్‌ పునరుజ్జీవనం ప్రారంభమైందని వేణుగోపాల్‌ అన్నారు. సిడబ్ల్యుసిలో నాలుగు నెలల క్రితంతో పోలిస్తే వాతావరణం పూర్తిగా భిన్నంగా, ఉత్సాహంగా ఉందని ఆయన అన్నారు. ‘రాహుల్‌ గాంధీ కచ్చితంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత కావాలి. ఇది మా కార్యవర్గ అభ్యర్థన. ఆయన నిర్భయుడు, ధైర్యవంతుడు’ అని సిడబ్ల్యుసి సమావేశం అనంతరం కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపి ప్రమోద్‌ తివారీ అన్నారు. ఈ సిడబ్ల్యుసి సమావేశంలో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, కర్ణాటక సిఎం సిద్ధ రామయ్య, డికె శివకుమార్‌, హిమాచల్‌ సిఎం సుక్విందర్‌ సింగ్‌ సుకు, ఎపి నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జెడి శీలం, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం కాంగ్రెస్‌ పార్ల మెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాత్రి ఎంపిలతో రాహుల్‌ గాంధీ విందు సమావేశం ఏర్పాటు చేశారు.

➡️