చండీగఢ్: జనవరి 21 నుండి రైతు జాతాను పున:ప్రారంభించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంజాబ్ హర్యానాల మధ్య శంభుసరిహద్దు నుండి 101 మంది రైతుల బృందం ఢిల్లీమార్చ్ చేపట్టనుందని కిసాన్ మజ్దూర్ మోర్చా (కెఎంఎం) నేత సర్వాన్‌సింగ్ పంధేర్ గురువారం ప్రకటించారు.
జనవరి 21 నుండి 101 మంది రైతులతో జాతాను పున:ప్రారంభించాలని సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర విభాగం ఎస్‌కెఎం), కెఎంఎంలు నిర్ణయించినట్లు తెలిపారు. గత 11 నెలలుగా శంభు, ఖన్నౌరిల్లో దీక్ష చేపడుతున్నప్పటికీ .. రైతుల డిమాండ్లను కేంద్రం ఆమోదించడం లేదని సర్వాన్‌సింగ్ మండిపడ్డారు.
రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదని, ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలన్నది రెండు సంఘాల నిర్ణయమని అన్నారు. గత 50 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌కి సంఘీభావంగా 111 మంది రైతుల బృందం కన్నౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేపట్టిన మరుసటి రోజు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
డిసెంబర్ 6, డిసెంబర్ 8 మరియు డిసెంబర్ 14 తేదీలలో 101 మంది రైతులతో కూడిన జాతా శంభు సరిహధ్దు నుండి ఢిల్లీ వెళ్లేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ మూడు ప్రయత్నాల్లో రైతులపై భద్రతా బలగాలు, హర్యానా పోలీసులు టియర్‌గ్యాస్, షెల్స్‌ను ప్రయోగించాయి. దీంతో దాదాపు 50 మంది రైతులకు గాయాలయ్యాయి. డిసెంబర్ 14న ఈ జాతాలో పాల్గొనని ఓ రైతు విషం తాగాడు.