డిసెంబర్‌లో నాలుగు నెలల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ :  రిటైల్‌ ద్రవ్యోల్బణం 2024 డిసెంబర్‌లో నాలుగు నెలల కనిష్టం 5.22 శాతానికి పడిపోయింది. ఇది నవంబర్‌లో 5.5 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 9.04 శాతం నుండి డిసెంబర్‌లో 8.4 శాతానికి స్వల్పంగా తగ్గిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) సోమవారం ప్రకటించింది. 2024 డిసెంబర్‌లో అఖిల భారత స్థాయిలో సంవత్సరానికి ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్న మొదటి ఐదు వస్తువులు బఠాణీలు (89.12శాతం), బంగాళా దుంపలు (68.23 శాతం), వెల్లుల్లి (58.17శాతం), కొబ్బరి నూనె (45.41 శాతం), కాలీఫ్లవర్‌ (39.42శాతం) అని ఎన్‌ఎస్‌ఒ పేర్కొంది.

2024-25 మూడవ త్రైమాసికంలో భారత వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం సగటున 5.63 శాతంగా ఉంది. గత నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) అంచనా వేసిన 5.7 శాతం కన్నా స్వల్పంగా తగ్గినట్లు ఎన్‌ఎస్‌ఒ తెలిపింది.

నెలవారీ ప్రాతిపదికన, డిసెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) 0.56 శాతం తగ్గింది. అయితే వినియోగదారుల ఆహార ధరల సూచీ(సిఎఫ్‌పిఐ) నవంబర్‌ కన్నా 1.5 శాతం తక్కువగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా నాలుగు నెలల కనిష్టానికి తగ్గింది. అక్టోబర్‌లో 15 నెలల గరిష్టస్థాయి 10.9 శాతం నుండి డిసెంబర్‌లో క్షీణతను సూచిస్తుంది. కొన్ని కీలకమైన ఆహార పదార్ధాల ధరలు వేగంగా పెరిగాయని పేర్కొంది.

➡️