బెంగళూరు : దిగ్గజ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. ఇది భారత్‌లోని అన్ని కాగ్నిజెంట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి వర్తిస్తుందని వెల్లడించింది. అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకొనేందుకు ఈ మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక ఐటి కంపెనీలు ప్రస్తుతం తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్లుగా నిర్ణయించాయి. తాజాగా కాగ్నిజెంట్ ఈ వయసును 60కి పెంచడంతో మిగతా కంపెనీలు ఇదే బాటలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. తమ సంస్థకు భారత్‌లో 2.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) రవి కుమార్ పేర్కొన్నారు. ఇంతక్రితం పెద్ద నగరాల్లోనే తమ కార్యాలయాలు ఉండేవని.. ఇప్పుడు చిన్న నగరాలకూ విస్తరించామన్నారు.