న్యూఢిల్లీ : వాయు కాలుష్య తీవ్రత అధికం కావడంతో ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో గ్రాప్ (జిఆర్‌ఎపి)-3 దశ నిబంధనలను తిరిగి అమలు చేయనున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది. ఢిల్లీలో సోమవారం ఉదయం వాయు నాణ్యతా ప్రమాణ (ఎక్యూఐ) సూచీ 351 (చాలా పేలవమైన ) కేటగిరీకి పడిపోయిన సంగతి తెలిసిందే. ఉదయం 9.00 గంటలకు ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలుగా నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు, పేలవమైన వాయు నాణ్యతలతో ఢిల్లీలో ఇప్పటికే సవాలుగా నిలిచిన కాలుష్య స్థాయిలను మరింత దిగజార్చినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్రం గ్రాప్ 3 కింద కఠినమైన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అత్యవసరం కాని నిర్మాణాలపై నిషేధం, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించింది. కఠిన వాహన నిబంధనలు అమలుకానున్నాయి.
