కొల్‌కతా : వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరననలు జరిగాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్త చోటు చేసుకొంది. అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు పోలీసు వాహనాలను దగ్ధం చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ఇప్పటికీ ముగ్గురు ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఇప్పటికే 250 మందిని అరెస్టు చేశారు. అయినా అల్లర్లు అదుపులోకి రావడం లేదు.
కాగా, మరోవైపు బెంగాల్‌లో జరుగుతున్న అల్లర్లపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా ఈ పిటిషన్ వేశారు కోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ కొనసాగాలని కోరారు. ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు, హింసను నివారించేలా కోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పదికి పైగా పిటిషన్లు దాఖలు కాగా.. ఈ నెల 16న సుప్రీంకోర్టు వీటిని విచారించనుంది.
