పాట్నా : బీహార్‌లోని నితీష్ కుమార్ పాలనపై ప్రతిపక్షపార్టీ అయిన ఆర్‌జెడి (రాష్ట్రీయ జనతాదళ్) తీవ్రస్థాయిలో విమర్శలు సంధిస్తోంది. గత మూడురోజులుగా ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నా.. నితీష్‌కుమార్‌కు కనిపించడం లేదంటూ బుధవారం ఆర్‌జెడి ఎమ్మెల్యే ముకేష్ రోషన్‌కళ్లకు గంతలు కట్టుకుని అసెంబ్లీకి హాజరయ్యారు. ‘నేను సుశాసన్ బాబు (మంచి అడ్మినిస్ట్రేటర్), నేను అంధుడిని అయ్యాను. నేను ఏమీ చూడలేను’ అని రాసిన ప్లకార్డు పట్టుకుని ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘బీహార్‌లో అవినీతి జరుగుతున్నా సుశాసన్ బాబు (నితీష్‌కుమార్)కు ఇవేమీ కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గా లేవు. నేరాలు నిరంతరం జరుగుతున్నా.. సుశాన్‌బాబుకు కనిపించడం లేదు’ అని ఆయన విమర్శించారు.
కాగా, రోషన్ వైశాలి జిల్లా మహువా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో అక్రమ మద్యం, రిజర్వేషన్, వక్ఫ్ బిల్లు, స్మార్ట్ మీటర్స్ వంటి అంశాలపై అసెంబ్లీలో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో రోషన్ కళ్లకుగంతలతో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.