న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ ఐక్యంగా ఉందని, నితీష్‌కుమార్‌ను అడ్డుకుని తీరతామని ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్ పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌కు అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తేజస్వీయాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ”కాంగ్రెస్‌తో సమావేశమయ్యామని, చర్చలు సానుకూలంగా జరిగాయని అన్నారు. ఏప్రిల్ 17న పాట్నాలో ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి మరోసారి సమావేశమవుతామని అన్నారు. మేము పూర్తిగా సన్నద్ధమయ్యామని, బీహార్‌ను అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువెళతామని అన్నారు. ప్రతిపక్షాలతో చర్చించి, ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకగ్రీవంగా నిర్ణయం ప్రకటిస్తామని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
20ఏళ్ల ఎన్‌డిఎ పాలన తర్వాత కూడా బీహార్ అత్యల్ప తలసరి ఆదాయం, రైతుల స్వల్ప ఆదాయాలు, అత్యధిక వలస రేటుతో అత్యంత పేద రాష్ట్రంగా మిగిలిపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రధానంగా రాష్ట్ర సమస్యలను లేవనెత్తనున్నామని, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం అందరి విధి అని అన్నారు. నితీష్‌కుమార్‌ను అడ్డుకుని తీరతామని, ఈ సారి బీహార్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆశాభావం వ్యక్తం చేశారు.
