Road accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

Mar 13,2025 11:23 #Madhya Pradesh, #road accident

ధర్‌ : మధ్యప్రదేశ్‌ ధర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్‌ ట్యాంకర్‌ రాంగ్‌ సైడ్‌ వచ్చి.. కారుతోపాటు పలు వాహనాలను బలంగా ఢకొీట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ధర్‌ జిల్లాలోని బమన్సుత గ్రామ సమీపంలోని బద్నావర్‌ ఉజ్జయిని జాతీయ రహదారిపై గ్యాస్‌ ట్యాంకర్‌ను నడుపుతున్న డ్రైవర్‌ తప్పుదారిలో వాహనాన్ని నడిపి.. ఎదురుగా వస్తున్న కారు, జీబును బలంగా ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల్లో ప్రయాణీస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రగాయాలతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ధర్‌ ఎస్‌పి మనోజ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సీనియర్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాల్లో చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. దీనికి స్థానికులు కూడా సహాయం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని రత్లాం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితులు రత్లాం, మందసౌర్‌, జోధ్‌పూర్‌ జిల్లాలకు చెందినవారని ఎస్‌పి మనోజ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన గ్యాస్‌ ట్రక్కు డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

➡️