road accident : ముంబయిలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి.. 49 మందికి గాయాలు

Dec 10,2024 15:34 #Maharashtra, #road accident

ముంబయి : ముంయిలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలోని కుర్లాలో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన బెస్ట్‌ అనే బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 49 మంది గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి వెళ్తున్న బెస్ట్‌ బస్సు బుద్ధ కాలనీ వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్‌ అయి పాదచారులపైకి, కొన్ని వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగ్రాతులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఈ ఘటనలో పోలీసులు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడంతో నియంత్రణ కోల్పోయినట్లు డ్రైవర్‌ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే బస్సును డ్రైవర్‌ అతివేగంతో నడిపారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు.. కొత్తదేనని.. మూడు నెలల క్రితమే రిజిస్ట్రేషన్‌ అయిందని ఆర్‌టివో పేర్కొన్నారు.

 

➡️